ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం, కరువు పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే నెలల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, ప్రజలు, రైతులపై ప్రభావం తగ్గించేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఒకవైపు అఖిలపక్ష నేతలతో చర్చించి సూచనలు స్వీకరిస్తూనే.. మరోవైపు గ్రామీణ స్థాయిలో కరువు నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అవసరమైతే అఖిలపక్షప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన సాయం కోరుతామని ప్రకటించారు.
Also Read : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్..!
ఎల్ నినో ప్రభావాన్ని అధ్యయనం చేసి, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన చర్చల్లో వర్షపాతం లోటు, తాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటలు, పశువులకు నీరు, మేత అందించడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు. కరువు ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. విపత్తు పరిస్థితుల్లో రాజకీయ విమర్శల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అఖిలపక్షనేతలు సూచించిన అంశాలను పరిశీలించి, సాధ్యమైన మేరకు కార్యాచరణలో భాగం చేస్తామన్నారు. గతంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలోనే ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా సమష్టిగా పనిచేయాలన్నారు.
కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మండల స్థాయి సమన్వయ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం, తాగునీటి భద్రత, పశుగ్రాసం అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 35,959 చిన్న నీటిపారుదల చెరువుల పరిధిలో పశుగ్రాసం సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సాగును ప్రోత్సహించనున్నారు. పశువుల తాగునీటి కోసం వ్యవసాయ కుంటలు, చెక్ డ్యామ్లు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణా నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలో అవసరమైన పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించనున్నారు.
Also Read : బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్ కు కష్టాలు..!
పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షపాతం లోటు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోందని భట్టి పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశాలు తగ్గిన నేపథ్యంలో రిజర్వాయర్లలో నిల్వలు, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల ఆధారంగా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.


