ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యాలయంపై… ఆ తర్వాత గన్నవరం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విమర్శలకు వేదిక అయింది. దీనిలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇవి కేవలం ఆరోపనలే కాదు.. వాస్తవం అంటూ దాడికి సంబంధించిన రుజువులు కూడా ఇప్పటికే మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై చర్యలకు పోలీసులు రంగం సిద్దం చేసారు.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 85 మందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో దర్యాప్తు పోలీసులు వేగవంతం చేసారు. మొత్తం 106 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 21 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నిన్న, మొన్న నోటీసులు జారీ చేసారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఆరవ సత్యం వంటి ముఖ్య నేతలతో పాటు ఓ టివి ఛానల్ రిపోర్టర్ కు కూడా నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుతం అవినాష్ అందుబాటు లేకపోవడంతో వారి నివాసానికి నోటీసులు అంటించారు. అదే విధంగా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి వెళ్లి కార్యాలయ సిసి ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు జారీ చేసారు. గుంటూరు కు చెందిన పలువురు టిడిపిలో జాయిన్ అవ్వడంతో ఈ కేసులో పోలీసులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో మాత్రం కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టవద్దు అంటూ కోరుతున్నారు. దాడిలో పాల్గొన్న విజయవాడ, గుంటూరు చెందిన కార్పొరేటర్లను అరెస్టు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అప్పట్లో చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. మరి ఏం జరగబోతుంది ఏంటీ అనేది చూడాలి.




