ఆయన ఏం చెబితే అదే ఫైనల్.. ఎదురు చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు… ఎదురు మాట్లాడే సాహసం కూడా ఎవరు చేయరు. అలా కాదని ఎవరైనా సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే.. ఇక అంతే సంగతులు. ఇదంతా గతం. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరైనా.. ఏమైనా మాట్లాడవచ్చు.. ఏమైనా అంటే.. ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ కవర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏమిటీ.. ఆ నేత ఎవరో తెలిసిందా.. ఎవరో కాదు.. ఆయనే కేసీఆర్. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఇంకా చెప్పాలంటే నడిపించే నాయకుడు లేక.. చుక్కాని లేని నావ మాదిరిగా నడి సంద్రంలో కొట్టుమిట్టాడుతోంది ప్రస్తుత భారతీయ రాష్ట్ర సమితి.
Also Read : పహల్గాం దాడికి నెల.. ఆ ఆరుగురు ఎక్కడ..?
2002లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసారు. ఇక టార్గెట్ కాంగ్రెస్ అన్నట్లుగా 2009 నుంచి పోరాటం చేశారు. చివరికి యూపీఏ సర్కార్ ప్రత్యేక తెలంగాణ ప్రకటించే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడువున్నప్పటికీ.. అనూహ్యంగా 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. రెండోసారి కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అయితే.. నాటి నుంచే పార్టీలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే మాట వినిపిస్తోంది.
Also Read : హరీష్ రావుకే కవిత మద్దతు..? లేఖ ఉద్దేశం ఇదేనా..?
రెండోసారి పార్టీ గెలిచిన ఆరు నెలల తర్వాత నుంచి సీఎం అభ్యర్థిగా కేటీఆర్ కొనసాగుతారంటూ ప్రచారం జోరుగా సాగింది. ఒక దశలో సీఎం కేటీఆర్ అంటూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు కూడా పెట్టారు. అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్.. ప్రస్తుతానికి అధికార మార్పు లేదని తేల్చేశారు. అయితే కేటీఆర్ మాత్రం ప్రభుత్వంలో షాడో సీఎం మాదిరిగా వ్యవహరించారు. ప్రభుత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇతర నేతలకు కాస్త ఇబ్బందిగా మారిందనేది వాస్తవం. అటు కుటుంబంలో కూడా అధిపత్య పోరు మొదలైంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేశారు కేసీఆర్. జాతీయ స్థాయిలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. హ్యాట్రిక్ సాధిస్తామని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు.. చివరికి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.
Also Read : భయం భయంగా బెజవాడ.. మళ్ళీ ఎందుకీ అలజడి..?
ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావటం లేదు. దీంతో పార్టీ నడిపించే నేత ఎవరూ అనే ప్రశ్న ఇప్పుడు కార్యకర్తల్లో బాగా వినిపిస్తోంది. అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ రావటం లేదు. దీంతో అక్కడ కూడా ప్రతిపక్షం తరఫున కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కేడే అసలు సమస్య తలెత్తింది. వాస్తవానికి కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరికిస్తారనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది. అధ్యక్ష కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ రావు, కవిత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలు, నేతల్లో ఎవరికి వారు తమ బలాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవల పార్టీ 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే ఇబ్బందులు తలెత్తాయి. ఇక పార్టీ పరిణామాలపై కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు బీఆర్ఎస్‌లో దుమారం రేపుతోంది.
Also Read : అన్నల సారథి ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..!
ముందు ఈ లేఖ కవిత రాయలేదని బీఆర్ఎస్ నేతలు వాదించారు. అయితే ఆ లేఖ తానే రాసినట్లు కవిత స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది కూడా. అయితే కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. కేసీఆర్‌కు ఎవరైనా సరే లేఖలు రాయవచ్చని.. అలా రాసిన లేఖలో సలహాలు, సూచనలు కూడా చేయవచ్చన్నారు. కవిత లేఖ పెద్ద విషయమే కాదన్నారు. అదే సమయంలో పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడితే అందరికీ మంచిదని.. ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా సరే.. అధినేత కేసీఆర్ ఫైనల్ అని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్.
Also Read : ఆలియా భట్ @ కేన్స్ ఫిలిం ఫెస్టివల్
అయితే ఇప్పటికే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా నడుస్తోంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కవిత కూడా తోడయ్యారు అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అసలే అధికారమే లక్ష్యంగా పార్టీ ప్రారంభించారనేది కేసీఆర్‌పై ఉన్న ప్రధాన అభియోగం. ఇప్పుడు తన వారసులు కూడా అదే టార్గెట్ అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు సరైన నాయకత్వం లేదని కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బోణీ కూడా కొట్టలేదని ఎద్దేవా చేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరడం.. భారతీయ రాష్ట్ర సమితి… బీఆర్ఎస్ మనుగడకే ప్రశ్నార్థకంగా మారాయనేది రాజకీయ విశ్లేషకుల మాట.