తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. దీంతో పార్టీ పదవుల ఎంపికపై అధినేత దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గం, జిల్లా స్థాయి కమిటీల ఎంపిక దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర స్థాయి పదవులను భర్తీ చేస్తున్నారు. నిజానికి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త వారికి పదవులను కేటాయిస్తారని అంతా అనుకున్నారరు. కానీ.. పార్టీ గెలిచిన వెంటనే.. కేవలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రమే కొత్తగా నియమించారు. అప్పటి వరకు ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడును తొలగించి.. పల్లా శ్రీనివాస్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి మిగిలిన స్థానాల భర్తీ ఎప్పుడా అని పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read : వైసీపీ నేతకు టీడీపీ పదవి.. అంతా గందరగోళం..!
బీసీ విభాగం అధ్యక్షునిగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్సీ విభాగం అధ్యక్షునిగా ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా హోమ్ మంత్రి వంగలపూడి అనిత కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొల్లు రవీంద్ర, అనితలు మంత్రులయ్యారు. దీంతో పార్టీ పదవుల నుంచి తప్పిస్తారనే ప్రచారం తొలి నుంచి జరుగుతుంది. కానీ.. ఏడాదిన్నర కాలంగా పదవుల భర్తీని అధినేత పూర్తిగా పక్కన పెట్టారనే మాట బాగా వినిపిస్తోంది. తాజాగ ఈ ఏడాది మహానాడు లోపు పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో పదవుల కోసం ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ లక్ష్మీ శ్యామలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంపిక ప్రకటన అధికారికంగా ఇంకా విడుదల కాలేదు. అయితే వీఆర్ లక్ష్మీ శ్యామల ఎంపికపై పార్టీ కార్యకర్తలకు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ శ్యామల కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టికెట్ ఆశించిన లక్ష్మీ శ్యామలకు కాదని గళ్లా మాధవికి టికెట్ ఇచ్చారు. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ శ్యామల పర్యటించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవిని ప్రస్తుత డ్వాక్రా సాధికర సమితి అధ్యక్షురాలు ఆచంట సునీత ఆశించారు. అయితే ఆమెను కాదని లక్ష్మీ శ్యామల పేరుతో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నారు.
Also Read : భారత జట్టులో సంచలన మార్పులు..!
ప్రస్తుతం శ్రీ సురభీ డెయిరీ సంస్థ ఎండీగా లక్ష్మీ శ్యామల కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త లోకాద్రి నాయుడు సతీమణి. వీరు చిన్న జియ్యర్ స్వామి భక్తులు. అందుకే లక్ష్మీ శ్యామల పేరును స్వామీజీ సిఫారసు చేశారనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు, లోకేష్ తమిళనాడు పర్యటనల సమయంలో లక్ష్మీ శ్యామల వారి పక్కనే ఉన్నారు. అయితే రెండేళ్లుగా పార్టీ ఉపాధ్యక్షురాలి పదవిలో ఉన్న లక్ష్మీ శ్యామల.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ గురించి ఎక్కడా ప్రసంగించలేదు. వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఏడాదిన్నర కాలంగా ఒక్కసారి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇలాంటి వ్యక్తికి తెలుగు మహిళ పదవి ఎలా ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది.

