తెలుగు రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి హరీష్ రావు. ఎలాంటి పరిస్థితులను అయినా సరే.. చక్కదిద్దగల సమర్థులనే పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు హరీష్. అందుకే హరీష్ రావు పైన భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా నమ్మకం. ఎంత కష్టమైన పని అయినా సరే.. హరీష్ సులువుగా పూర్తి చేస్తారని కేసీఆర్ ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించారు.
Also Read : పెద్దిలో తమిళ హీరో..? డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!
తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం జంట నగరాల పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పైనే ఉంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి తో జూబ్లీహిల్స్‌లో ఎన్నిక అనివార్యమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్‌లో కూడా నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ తరఫున సినీ నటి జయసుధ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే వెలువడిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నాయి. ఇక ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత పావులు కదుపుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆదేశించారు.
Also Read : విద్యార్థుల మనసు గెలిచిన లోకేష్.. మరో సంచలన నిర్ణయం
కేసీఆర్ సూచనలతో రంగంలోకి దిగిన హరీష్.. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. గోపీనాథ్ గతంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. గోపీనాథ్ ఆశయాలను సునీత కొనసాగిస్తారంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను హరీష్ బుజ్జగిస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బలా ఉండాలంటున్నారు హరీష్. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న హరీష్ రావు.. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హరీష్ దూకుడుపై హస్తం పార్టీ నేతలు కూడా కలవరపడుతున్నారు. దీంతో ట్రబుల్ షూటర్ కారు పార్టీని గట్టు ఎక్కిస్తారా లేదా చూడాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు కూడా.