పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమలను దృష్టిలో ఉంచుకుని మూడు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మూడు జోన్లకు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా ఉండనున్నాయి. గతంలో అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కావడం వల్ల జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ కొత్త విధానాన్ని ప్రతిపాదించారు చంద్రబాబు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : టార్గెట్ ఫిక్స్ అంటున్న గులాబీ బాస్..!
ఈ కొత్త జోన్ల వ్యవస్థను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ప్రతీ జోన్‌కు ఓ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు మెంబర్స్‌గా ఉంటారు. పాలనాపరమైన నిర్ణయాలు, వాటి అమలును వేగవంతం చేయడానికి ప్రతి జోన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించారు. వీటిలో విశాఖ జోన్‌కు సీనియర్ ఆఫీసర్ యువరాజ్ , అమరావతి జోన్‌కు ముకేష్ కుమార్ మీనా ,రాయలసీమ జోన్‌కు ఎమ్.టి. కృష్ణబాబుకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. వీరికి ఆర్థిక, పరిపాలనాపరమైన అధికారాలు ఉండనున్నాయి. ఈ స్వతంత్ర యంత్రాంగం ద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల అమలులో వేగం పెరిగి, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మరింత ఈజీ కానుంది.
ఈ జోన్ల విభజనలో జిల్లాలను ప్రాంతాలవారీగా కేటాయించారు. విశాఖపట్నం జోన్‌లో 9 జిల్లాలు ఉండగా, పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మధ్య కోస్తా – అమరావతి జోన్‌లో 8 జిల్లాలు కేటాయించారు. ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార శుద్ధి, లాజిస్టిక్స్ మరియు వాణిజ్య రంగంపై దృష్టి పెడతారు. ఇక రాయలసీమ జోన్‌కు తిరుపతి కేంద్రంగా 9 జిల్లాలు రానున్నాయి. ఈ జోన్ పునరుత్పాదక శక్తి, మైనింగ్, ఉద్యానవన పంటలు మరియు ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
Also Read : ఈషా వేదికగా.. రాజ్ సమంత వివాహం?
ఈ త్రీ-జోన్ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి జోన్ తన సొంత లక్ష్యాలు, విధానాలతో పనిచేయడం ద్వారా రాష్ట్రం GSDP వృద్ధి లక్ష్యం 15% సాధించడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కీలకమైన సంస్కరణలు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వుల రూపంలో వెలువడే అవకాశం ఉంది. ఈ జోనల్ సిస్టమ్ సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తే.. అద్భుతమైన పాలనా సంస్కరణ అయ్యే అవకాశం ఉంది.

