టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు… తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. గతం కంటే భిన్నంగా 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని 18 మంది కొత్త మంత్రులు ఉన్నారన్నారు. ఒక కుటుంబంలోనే భార్యా, భర్త, పిల్లల మధ్య కొన్ని బేధాలు ఉంటాయన్న ఆయన… కూటమి లో కూడా అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయని అవి మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్ఆర్సీపీ 11 కి పడిపోవడానికి చేయని తప్పులు లేవన్నారు.
ఎన్ డీ ఏ లో ఉండే ఏ ఒక్క చిన్న కార్యకర్త తప్పు చేసినా దాని ప్రభావం సీఎం పై పడుతుందని… మన ప్రవర్తనే మళ్ళీ ఎన్నికల్లో మన గెలుపు ఓటములను నిర్దేశిస్తుందని తెలిపారు. ఇదే సింపుల్ లాజిక్ అని స్పష్టం చేసారు చంద్రబాబు. ఈ నాలుగు నెలలలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాను అని తెలిపిన ఆయన… అధికారంలోకి వచ్చిన 125 రోజుల తర్వాత పార్టీ భవిష్యత్ ప్రణాళిక చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం తో పాటు ప్రజల అంచనాలను అందుకోవాలని సూచించారు.
Also Read : దీపావళి లోపే జోరందుకోనున్న తెలంగాణ టిడిపి
అదే సమయంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడే పార్టీ శ్రేణులను కాపాడుకోవాలని నేతలకు దిశా నిర్దేశం చేసారు. ఇక కూటమి పార్టీల సమన్వయం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 2029 లో మళ్ళీ ఇదే కూటమి కొనసాగనుందని సంకేతాలు ఇచ్చిన సీఎం… కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న 29 నియోజకవర్గాలనూ కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికలు ఐపోయాయి, ఇక కూటమి పార్టీలతో పని లేదని అనుకోవద్దని మళ్ళీ ఎన్నికలు వస్తాయి, కలిసే పని చేయాల్సి ఉంటుంది, గుర్తు పెట్టుకుని మసలుకోండని స్పష్టం చేసారు.