తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేకు నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం.. టీవీకే పార్టీకి మధ్య గట్టి పోటీ ఉంటుందని ఇప్పటికే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా విజయ్ పావులు కదుపుతున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ఇకపై తాను సినిమాల్లో నటించేది లేదని తేల్చేశారు. ఈ సంక్రాంతికి వస్తున్న జన నాయగన్ తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించారు. ఇక విజయ్‌తో పొత్తు కోసం జాతీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సారధ్యంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా తమిళనాడులో పర్యటించిన అమిత్ షా కూడా.. తమ పార్టీ నేతలకు ఇదే విషయంపై కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే విజయ్‌తో పొత్తు కుదిరేలా చూడాలని సూచించినట్లు తెలుస్తోంది.
Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!
తమిళనాడులో బీజేపీకి కనీస ప్రాతినిధ్యం లేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. అందులో 4 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ ఈసారి మాత్రం తమ బలం మరింత పెంచుకోవాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు కమలం పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జయలలిత మరణానంతరం బలహీనపడిన అన్నాడీఎంకే నుంచి పలువురు కీలక నేతలు ఇప్పటికే టీవీకేలో చేరారు. దీంతో రాబోయే ఎన్నికల్లో డీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగానే పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు.
టీవీకే పార్టీ స్థాపించిన విజయ్.. ఇప్పటికే పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్ 17న కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. నిజానికి సీబీఐ విచారణ అవసరం లేదని.. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలో అంశమన్న డీఎంకే ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటన విచారణను సిట్‌కు అప్పగించింది. అయితే తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఘటనపై స్వతంత్ర, నిస్పాక్షిక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది.
Also Read : పరకామణిలో దొంగలు ఈ పోలీసులేనా..?
రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఇప్పటికే పలువురు టీవీకే పార్టీ నేతలతో పాటు ప్రత్యక్ష సాక్ష్యులను కూడా విచారించారు. తాజాగా టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు హజరవ్వాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్‌ను బెదిరించేందుకే సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారనే చర్చ ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తోంది.

