ఒకరిని చూస్తే పెట్టాలని అనిపిస్తుంది.. ఒకరిని చూస్తే కొట్టాలని అనిపిస్తుంది.. ఇది సామెత. ఈ మాట వైసీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది కూడా. నిజమే.. అబద్ధాలు చెప్పడంలో వాళ్లకు వాళ్లే సాటి. ఎందుకంటే.. ఐదేళ్ల వైసీపీ పాలనలో మేము అది చేశాం.. మేమిది చేశాం.. అని గొప్పలు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు కూడా. అయితే ఆ చేసిన పనులేవి అంటే.. పేపర్ తీసి టక టకా చెబుతారు… మరి ఆ మంచి కనిపిస్తుందా.. అంటే నోరెత్తటం లేదు. ఇదేదో టీడీపీ నేతలు చెబుతున్న మాట కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి టీవీలో యాంకర్‌ను ఓ పార్టీ ప్రతినిధి ప్రశ్నించగా.. మీకు జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమల జాబితా చదివి వినిపిస్తా.. అని ఓ లిస్ట్ చదువుతారు.. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయని అడిగిన ప్రశ్నకు.. మీకు లిస్ట్ కావాలా.. అడ్రస్ కావాలా.. అని మాట దాటేశారు సదరు యాంకర్ గారు. ఇలా ఉంటుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలు, అభిమానుల తీరు.
Also Read : పొన్నవోలుకు ఓ దండం.. జగన్ వద్దకు పంచాయితీ..!
అదే సమయంలో అసలు వైసీపీ హయాంలో జరిగింది ఏమిటీ అని ఏపీలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా సరే.. రంగస్థలం సినిమాలో ఓ పాటలో చెప్పినట్లు.. అన్యాయం, అధర్మం, అవినీతి, దౌర్జన్యం, దోపిడీ, మాఫియా అని ఎవరైనా చెప్పేస్తారు. వైసీపీ ఐదేళ్ల పాలనను తుగ్లక్ పాలనతో పోల్చుతారు. 3 రాజధానులు, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులు.. చట్ట సభ అనే కనీస మర్యాద కూడా పాటించకుండా దాడులకు తెగబడిన చరిత్ర వైసీపీ నేతల సొంతం. అందుకే ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. త్వరలో జరగబోయే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే లేదు అన్నట్లుగా పెత్తనం చేశారు. అది ఏ స్థాయిలో అంటే.. ఎవరినైనా సరే.. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు అని ప్రశ్నిస్తే.. బయటకు చెప్పేందుకు భయపడుతున్నారు. ఎవరి పాలన బాగుందనే ప్రశ్నకు అయితే.. కనీసం నోరు కూడా విప్పటం లేదు. ఇలాంటి పాలేగాళ్ల గురించి మాట్లాడాలంటే.. భయపడే పరిస్థితి ఇప్పటికీ పులివెందులలో కనిపిస్తుందంటే వైఎస్ కుటుంబ అరాచకాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో 90 వేల మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్.. 2024లో 60వేలకు పడిపోయారు. అంటే.. ప్రజల్లో కాస్త ధైర్యం వచ్చింది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా ప్రత్యేక వాహనాల్లో మహానాడుకు హాజరయ్యారు.
Also Read : సుందర్ పై ఆసిస్ దిగ్గజాల ప్రశంశలు..!
త్వరలో జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. చివరికి పోలీసులపై దాడి చేసేందుకు కూడా తెగబడుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ఆ పార్టీకే నష్టం చేస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన దాదాపు అందరు వైసీపీ నేతలు ఇప్పుడు పులివెందుల చేరుకున్నారు. వీరికి ఎంపీ అవినాష్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే ఆ పార్టీకి పెద్ద చేటు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ప్రజల మనోభావాలు ప్రతికూలంగా మారుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై వ్యతిరేకత ఉందనే మాట వాస్తవం. గతంలో జగన్ సీఎం హోదాలో పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు.. ఒకరు సాయం కోసం లేఖ అందించారు. దానిని అవినాష్‌కు ఇవ్వాలని జగన్ చెబితే.. సార్.. మీరే తీసుకోండి అని కోరారు. పర్లేదు.. ఆయన మా తమ్ముడే అప్ప.. ఏం కాదులే.. అని జగన్ చెప్పినా కూడా వచ్చిన వాళ్లు వినలేదు. ఇందుకు ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ పై వచ్చిన ఆరోపణలు, సీబీఐ విచారణ, బెయిల్.. ఇవన్నీ ప్రజల్లో అనుమానాలను పెంచాయి. ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని జిల్లా పెద్ద దిక్కుగా భావించిన ప్రజలు.. ఇప్పుడు కుటుంబ రాజకీయాల వల్ల రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతీ చోటా కూడా.. కేసులు, ఆరోపణల గురించే చర్చించుకుంటున్నారు. ఇది వైసీపీ అభ్యర్థి గెలుపు కంటే కూడా.. ఓటమికే కారణమంటున్నారు విశ్లేషకులు.
Also Read : ఉప రాష్ట్రపతి ఆయనే..? తమిళ బ్రాహ్మిణ్ కు కీలక పదవి..!
ఇక నిన్నటికి నిన్న నల్లగొండువారిపల్లెలో టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి ప్రధానంగా అవినాష్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమంటున్నారు. టీడీపీ అభ్యర్థి నల్లగొండువారిపల్లెలో ప్రచారం చేస్తున్న సమయంలోనే వైసీపీ నేతలు కూడా అటు వెళ్లాలని అవినాష్ రెడ్డి సూచించారనేది ఆ పార్టీ నేతల మాట. పోలీసులు కూడా వైసీపీ నేతలు కనంపల్లె, ఇ.కొత్తపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు మాత్రం నల్లగొండువారిపల్లెలోనే ప్రచారానికి వెళ్లడంతో.. అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం ప్రజలు ఫ్యాక్షన్ రాజకీయాలు కోరుకోవడం లేదు. ప్రజలకు కావాల్సింది ఉపాధి మాత్రమే. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తున్నారు. ఇలా గొడవలు పడటం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయనేది సాధారణ ప్రజల మాట.
ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా.. ఏ విషయం అయినా సరే.. ప్రతి ఒక్కరికీ ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఈ దాడి ఎవరి వల్ల జరిగిందనే విషయం ఇప్పటికే పులివెందులంతా పాకిపోయింది. అందుకే అవినాష్ రెడ్డి ప్రచారం వల్ల వైసీపీకి ఓట్లు పెరగటం అటుంచి.. ఓటమి ఖాయమనే మాటే బాగా వినిపిస్తోంది. నిజానికి గతంలో గ్రామానికి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి వస్తున్నారని తెలిస్తే.. ఓ సందడి వాతావరణం ఉండేది. ఆ నేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవాళ్లు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవినాష్ వస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రజలు.. కనీసం అటు వైపు కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతం యువత, రైతులు, మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి కావాలని కోరుతున్నారు తప్ప.. రాజకీయాలు కాదు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి.. ఆ తర్వాత అభివృద్ధి చేయాలనేది ప్రస్తుతం బాగా వినిపిస్తున్న మాట. కానీ వైసీపీ పాలనలో అభివృద్ధి అనే మాటే లేదు. ఇక అవినాష్ రెడ్డి అయితే.. నియోజకవర్గం ప్రజల సమస్యలు తీర్చడం మాట పక్కన పెట్టి.. ఎంతసేపు కేసుల గురించే మాట్లాడారు. కడప పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే.. నో ఆన్సర్. ఇది కూడా ప్రజల ఆగ్రహానికి కారణం.
Also Read : నేను రెడీగా ఉన్నా.. మోడీ సంచలన కామెంట్స్
గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం అభివృద్ధి కావాలనే కోరుతున్నారు. ఉద్యోగాలు, భద్రత గురించి ఆలోచిస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే.. ఫ్యాక్షన్ వద్దు.. కుటుంబ పెత్తనం వద్దు అనే మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కేవలం కుటుంబ వారసత్వం మాత్రమే సరిపోదు. ప్రజల నమ్మకం, విశ్వాసం కూడా తిరిగి పొందాలి. ఏ నాయకుడు అయినా సరే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కానీ అవినాష్ రెడ్డి ప్రచారం మొత్తం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏ నేత అయినా సరే.. తన హయాంలో జరిగిన మంచిని ప్రచారం చేసుకుంటారు. కానీ అవినాష్ మాత్రం.. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టారు.. అని తను తాను సమర్థించుకునేలా మాట్లాడుతున్నారు. ప్రచారం మొత్తం ఆరోపణలు, కేసుల చుట్టూ తిరుగుతున్నట్లుగా ప్రజలకు కనిపిస్తోంది. కాబట్టి.. ఈ ఎన్నికలో వైసీపీ ఓటమి కేవలం అవినాష్ రెడ్డి ప్రచారం వల్ల మాత్రమే అనే మాట బాగా వినిపిస్తోంది.