వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరూ..? ఈ ప్రశ్నలకు వైసీపీ నేతలు చెప్పే ఒకే ఒక్క జవాబు పవన్ కల్యాణ్. అధికారంలో ఉన్న ఐదేళ్లు టార్గెట్ పవన్ అన్నట్లుగా విమర్శలు చేశారు. వైసీపీలో సామాన్య కార్యకర్త మొదలు.. ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం కుర్చీలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్ అని, 3 పెళ్లిళ్లు అని, నిత్య పెళ్లికొడుకు అని.. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు. చివరికి సామాజిక వర్గం పేరుతో కూడా దూషణలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ వార్నింగ్ ఇచ్చి మరీ.. వైసీపీని ఘోరంగా ఓడించారు. నిజానికి చంద్రబాబు కంటే కూడా.. పవన్ అంటేనే జగన్‌కు ఎక్కువ కోపం ఉందంటున్నారు వైసీపీ నేతలు.
Also Read : జగన్ ఢిల్లీ ప్రయత్నాలు ఫలించేనా..?
తన ఓటమికి కారణమైన కాపు కులంలో కోల్పోయిన పలుకు బడిని ఏదో విధంగా పొందేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేయాలంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఏదో విధంగా కాపు కులంలో చీలిక తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని జగన్ రెడ్డి స్వయంగా వైసీపీ కాపు నాయకులను రెచ్చగొడుతున్నారని సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు తెలుసు. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కూడా. అంబటి రాంబాబు బూతు వ్యాఖ్యలు, అనంతర పరిణామాలపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కుల కుంపట్లు రాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు కూడా. అయితే చంద్రబాబుకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల.. పట్టు విడుపులు ఉంటాయి. కానీ మంత్రి లోకేష్ తీరు అలా లేదంటున్నారు టీడీపీ నేతలు.
లోకేష్‌లో మొండి పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే అసెంబ్లీలో తన తల్లిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను బాడీ షేమింగ్ చేసిన వారికి యువగళం పాదయాత్రతో జవాబిచ్చారు. తనను ఓడించిన మంగళగిరిలోనే 90 వేల మెజారిటీతో గెలిచి చూపించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేతగా లోకేష్ మారిపోయారు. అలాంటి లోకేష్‌కు ఇప్పుడు పెద్ద సమస్య ఎదురైందనే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.
అసలు విషయం ఏమిటంటే.. కాపు కులం కోటాలో రాజ్యసభ సీటు వంగవీటి రాధాకృష్ణమూర్తి అలియాస్ వంగవీటి రాధకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారనేది ఆయన సన్నిహితుల మాట. కానీ ఏడాది కాలంగా రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న.. తనకు అత్యంత సన్నిహితుడైనా సానా సతీష్‌కు మరోసారి అవకాశం ఇప్పించాలని మంత్రి లోకేష్ పట్టుపడుతున్నారని టీడీపీలో వినిపిస్తున్న మాట. వంగవీటి, సానా మధ్య నక్కకు నాగలోకానికి మధ్య తేడా ఉందంటున్నారు టీడీపీ నాయకులు. వంగవీటికి నేపథ్యం, సానా నేపథ్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయంగా కూడా వంగవీటి రాధకు ఉన్న పలుకుబడి సానా సతీష్‌కు లేదనేది టీడీపీ, జనసేన కాపు ఎమ్మెల్యేల మాట.
Also Read : బ్రేకింగ్: ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
చంద్రబాబుకు ప్రతి విషయం తెలుసు. ఒక నేతకు పదవి ఇచ్చే ముందు.. ఎన్నో కోణాల్లో ఆలోచిస్తారు. అందుకే 2019, 2024 ఎన్నికల్లో వంగవీటి రాధాను స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా ప్రచారం చేసేలా చంద్రబాబు ఎంపిక చేశారు. ఇలా చేయడం వల్ల కాపు సామాజిక వర్గం కొంత అనుకూలంగా మారిందనేది వాస్తవం కూడా. అయితే లోకేష్ మాత్రం కొన్ని కారణాల వల్ల కొందరి మాటలు వింటున్నారనేది టీడీపీ నేతల మాట. ముఖ్యంగా కాపు ఎమ్మెల్యేల్లో ఈ అభిప్రాయం ఉంది. నిజానికి ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు గురించి కూడా చాలా మంది నేతలు ఇదే తరహాలో చర్చించుకునే వారు. అప్పట్లో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు.. పార్టీ కంటే.. స్వంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది వాస్తవం. ఇప్పుడు ఇలాంటి వారే లోకేష్ చుట్టూ చేరారనేది రాజకీయ విశ్లేషకుల మాట.
నిజానికి రెండు రాజ్యసభ సీట్లు కాపు కులానికి ఇవ్వలేరు. తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ కాపు నాయకులు, ఆ పార్టీ అభిమానులు రెచ్చిపోతున్న నేపథ్యంలో.. వారి నోటికి తాళం వేయాలన్నా, రాజకీయ దూకుడుకు కళ్లెం వేయాలన్నా కూడా.. కాపు కులానికి చెందిన వంగవీటి రాధకు రాజ్యసభ సీటు తప్పని సరిగా ఇవ్వాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సానా సతీష్‌కు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. కానీ ఆయనకు పొలిటికల్ లాబీయిస్ట్ అనే చెడ్డ పేరు మాత్రం ఉంది. వంగవీటి రాధకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. కాపు సామాజికవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఈ విషయం సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు స్పష్టంగా తెలుసు.
టీడీపీ నేతలు మంత్రి లోకేష్ మెప్పు కోసం పైకి మాత్రం సానా సతీష్‌కు జై కొడుతున్నారు. కానీ చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు వంగవీటి రాధకు ఇస్తేనే మేలు జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ కాపు నాయకుల దూకుడుకు కళ్లెం వేయాలంటే.. వంగవీటి రాధ వంటి పవర్ పుల్ నేతకు ఇస్తేనే బెటర్ అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాధకు అభిమానులున్నారు. అటు వైసీపీలో కూడా రాధకు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి కాపు కులం కోటాలో రాధకు ఇస్తే మేలు జరుగుతుందని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాపు కులం కోటాలో రాజ్యసభ సిటు దక్కేదెవరికో.. అనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతోంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తారనే విషయం తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.

