ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు అక్షింతలు వేసింది. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు, సీఎం ఆమోదంతోనే జరుగుతుంటాయి. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఆర్వోల బదిలీలు, పోస్టింగులు ఒకప్పుడు రెవెన్యూ మంత్రి పరిధిలో జరిగేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయా రెవెన్యూ బదిలీలు, పోస్టింగుు అన్నీ మంత్రి పరిధి నుండి తప్పించి గతంలో తన పరిధిలోకి సీఎం చంద్రబాబు తీసుకున్నారనేది సచివాలయ వర్గాల మాట.
Also Read : వైసీపీ నేతకు టీడీపీ పదవి.. అంతా గందరగోళం..!
కోర్టు తీర్పు అమలు చేయకపోవటంపై ఏపీ సీఎస్ విజయానంద్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ ద్వారా జరిగిన ఆర్డీవో నియామకాల్లో, గోల్ మాల్ జరిగిందని, ఆధారాలతో సహా రుజువైంది. దీంతో ఆయా నియామకాలన్నింటినీ కోర్టు తప్పు పట్టింది. దీనితో అనేక మంది ఆర్డీవోలు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో కేసులు వేశారు. గతంలోకి వెళితే.. గ్రూప్ వన్ నియామకాల్లో గోల్ మాల్ జరిగిందని, అధికారంలోకి వచ్చాక ఆ నియామకాలాన్నింటిని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించలేదు.
కూటమి ప్రభుత్వంలో నాడు ఎంపికైన వారిలో కొందరిని మరింత ప్రాధాన్యత పోస్టుల్లో నియమించారు కూడా. దీంతో అప్పట్లోనే ఈ అంశంపై టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఘాటు కథనాలు వచ్చాయి. అయినా సరే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం చర్యలు తీసుకోలేదు. తాజాగా ఈ అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.కీలక, ప్రాధాన్యత పోస్టుల్లో ఉన్న ఆర్డీవోలందరినీ ఆయా ప్రదేశాల నుండి తప్పించాలని ఆదేశించినా పాలకులు పట్టించుకోలేదు. దీనితో ఆగ్రహం చెందిన కోర్టు సీఎస్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.
Also Read : రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. 2018 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల్ని వెంటనే అప్రాధాన్య పోస్టుల్లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కీలక పోస్టుల్లో నుంచి అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని సీఎస్‌ను హైకోర్టు మందలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సీఎస్ నిజంగానే నిర్లక్ష్యం చేశారా..? అనే చర్చ కూడా జరుగుతోంది. సీఎస్ ఫైలు పంపితే ప్రభుత్వ పెద్దలు ఆమోదించ లేదా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఆగ్రహం తర్వాత ఆఘమేఘాల మీద సీఎస్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాధాన్యత పోస్టులలో పనిచేస్తున్న ఆ అధికారులందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశాలతో.. ఆర్డీవోలను జీఏడీలో రిపోర్టు చేయాలని.. డీఎస్పీలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకాల వెనుక కొందరు అధికారుల ప్రమేయం ఉందనే మాట ఇప్పుడు సచివాలయంలో బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సీఎస్ విజయానంద్‌కు పంపిన ఫైల్లో వాస్తవాలు మరుగున పెట్టి.. అక్రమ నియామకాలకు అవకాశం కల్పించారని చర్చించుకుంటున్నారు.

