ఆంధ్రప్రదేశ్ లో గత వైసిపి ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలపై అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. ప్రధానంగా.. నాడు నేడు కార్యక్రమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వచ్చారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ కు లబ్ది లేకపోయినా భారతి సిమెంట్ కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అనే ఆరోపణలు వినిపించాయి. అలాగే నాడు నేడు విషయంలో ఆసుపత్రులపై కూడా దృష్టి సారించింది అప్పటి ప్రభుత్వం.
Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?
అయితే ఆసుపత్రుల్లో పనితీరుపై దృష్టి సారించకుండా కేవలం రూపురేఖలపై మాత్రమే దృష్టి సారించారని.. నాలుగు ఇటుకలు పేర్చి రెండు సిమెంట్ కట్టలు వాడి హడావిడి చేశారని టిడిపి కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. ఇక తాజాగా ఈ నాడు నేడు కార్యక్రమం పై అప్పుడు జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గవర్నమెంట్ స్కూల్స్ రూపు రేఖలు మార్చేశామని గత ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేసిన ఖర్చులు లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read : రేవంత్ పేరు కావాలనే మర్చిపోతున్నారా…?
ఈ పనులపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్ చేయాలని నిర్ణయించారు. స్కూల్ కు ఎన్ని నిధులు కేటాయించారు.. వాటిలో ఎంతవరకు ఖర్చు చేశారు… ఎలాంటి మార్పు వచ్చింది.. చేసిన ఖర్చుకు కనిపిస్తున్న పనులకు లెక్క సరిపోతుందా అనే కోణంలో తనిఖీలు చేయనున్నారు. నాడు నేడు పనులు జరిగిన 38 వేల 24 పాఠశాలల్లో ఆడిటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో రెండు విడతల్లో కలిపి 8,230 కోట్లు నాడు నేడు పథకానికి ఖర్చు చేశారు. ఆ స్థాయిలో ఫలితాలు బడుల్లో కనిపించడం లేదని ఆరోపణలు వినిపించాయి. వీటిపై తనిఖీలు అవసరమని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో మొత్తం పథకం పై ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.