ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమరావతి నిర్మాణ పనుల ముహుర్తం ఖరారైంది. ఐదేళ్ల పాటు పూర్తి నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. 2027 జూన్ నెలాఖరు నాటికి అమరావతి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే స్పష్టం చేశారు. అందులో భాగంగానే అమరావతిలో గతంలో చేపట్టిన నిర్మాణాల పరిస్థితిపై అంచనా వేసేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులతో సర్వే నిర్వహించారు. అలాగే సుమారు రూ.25 కోట్లతో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారు. అలాగే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణం కోసం అప్పట్లో వేసిన రాఫ్ట్ ఫౌండేషన్ పటిష్టతను కూడా పరిశీలించారు. ఐదేళ్ల పాటు నీటిలో నానినప్పటికీ… ఫౌండేషన్ ఏ మాత్రం చెక్కుచెదరలేదని ఐఐటీ నిపుణులు రిపోర్ట్ ఇవ్వడంతో… అమరావతి పనులను తిరిగి ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది.
Also Read : పోసాని.. నర్సారావుపేట టూ భవానిపురం వయా కర్నూలు.. హైదరాబాద్..!
త్వరలో అమరావతి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 12 – 15 తేదీల మధ్య రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. త్వరలోనే ముహుర్తం ఖరారు చేస్తామన్నారు. మొదటి దశలో ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన పనులు కూడా ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. నిర్దేశించిన సమయంలోనే అమరావతి పనులు పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. చెప్పినట్లుగానే అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ.
Also Read : అమరావతి సమీపంలో మెగా టూరిజం స్పాట్..!
ఇదే సమయంలో వైసీపీ నేతలపై మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముతో రాజధాని అమరావతి నిర్మిస్తున్నామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బులతో రాజధాని కట్టడం లేదని స్పష్టం చేశారు. రాజధానిలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా రెట్టింపుతో తిరిగి వస్తుందన్నారు మంత్రి. అసలు రాజధాని అమరావతిపై వైసీపీ నేతలకు విమర్శలు చేసే అర్హత లేదన్నారు. రాజధానిపై మీ స్టాండ్ ఏమిటని శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ప్రశ్నిస్తే… తర్వాత చెప్తాను అంటూ సభ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ ఏపీలో మూడు ముక్కలాట ఆడారాని ఆరోపించారు.
Also Read: మరోసారి పార్లమెంట్ కు అశోక్ గజపతి రాజు…!
ఇప్పుడు మాత్రం ఆలోచించి చెబుతా అంటున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ వల్ల రాజధాని టెండర్లు ఆలస్యం అయ్యాయన్న మంత్రి… మూడేళ్లలోనే అమరావతి రాజధాని అమరావతి పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. అమరావతిపై వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి… వాటికి ఇప్పుడు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిని స్మశానంతో పోల్చిన వైసీపీ నేతలు… మరి ఆ స్మశానంలోనే ఐదేళ్ల పాటు శాసనసభ ఎలా నిర్వహించారో జవాబు చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని మరోసారి మంత్రి నారాయణ స్పష్టం చేశారు.