ఏపీ సీఎం చంద్రబాబు తన పాలన స్టైల్ మార్చారు. నిన్న, మొన్నటి వరకు సౌమ్యంగా ఉంటూ.. మంత్రులకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. అయితే ఆరు నెలలు పాలన పూర్తి అవుతున్నా.. కొంతమంది మంత్రుల్లో మార్పు రాకపోవడం, కనీస అవగాహన కూడా పెంచుకోకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు పలువురు మంత్రుల పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండటంలేదన్న అంశాలు తన దృష్టిలో ఉన్నాయన్నారు. ఆరు నెలల తర్వాత స్వీయ నివేదిక ఇవ్వాలని మంత్రులకు చెబితే.. కేవలం ముగ్గురు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలని స్పష్టం చేశారు.
శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతుండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించకపోవటంపై కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వస్తే ఎంత సేపు పెండింగ్‌లో ఉంటుందన్న విషయం తనకు తెలుసని, కొంతమంది ఇంచార్జ్ మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లకపోవటం, అక్కడ సమీక్షలు చేయకపోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 20 పాలసీలు విడుదల చేస్తే.. వాటిని మంత్రులు పూర్తిగా అధ్యయనం చేయలేదని, వాటిపై ప్రజల్లో మాట్లాడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని, అందరూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పని చేయాల్సిందేనని, అవసరమైతే తానే వన్ టూ వన్ కూర్చుని మాట్లాడతానని చంద్రబాబు మంత్రులకు చెప్పారు.
Also Read : కుప్పం బాధ్యత నాది.. ఆకట్టుకున్న భువనేశ్వరి ప్రసంగం
ఇక నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ పరంగా పనితీరు ఎలా ఉందని ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేయిస్తానని చంద్రబాబు తెలిపారు. అయితే ఆ నివేదికలు తమకు ఇస్తే… లోపాలను సరి చేసుకునేందుకు వీలు ఉంటుందని పయ్యావుల కేశవ్ కోరగా, అందుకు సీఎం స్పందిస్తూ తప్పని సరిగా నివేదికలు అందిస్తామని చెప్పారు. అదే విధంగా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పైల్స్ వచ్చినప్పుడు ఎలా క్లియర్ చేస్తున్నారు, ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారో కూడా తాను పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పారు. మంత్రులు ఎంపీలతో సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను ఏపీకి వచ్చేలా కృషి చేయాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం 93 ఉంటే, గత ప్రభుత్వం వాటన్నింటినీ అమలు చేయడం నిలిపివేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 73 పధకాలు అమల్లోకి తీసుకువచ్చామని చంద్రబాబుకు పయ్యావుల కేశవ్ వివరించారు. ఈ పథకాల కింద నిధులు కూడా విడుదల అవుతున్నాయని పయ్యావుల కేశవ్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు.
స్థానిక సంస్థల చైర్మన్‌లు, అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం పెట్టే పదవీ కాలాన్ని రెండున్నర సంవత్సరాలకు కుదిస్తూ ఇచ్చిన ప్రతిపాదిత బిల్లును కేబినెట్ తిరస్కరించింది. మంత్రి నారాయణ జోక్యం చేసుకుని వచ్చే ఏడాది మార్చి నాటికి 73 పురపాలక సంఘాల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి అవుతుందని వివరించారు. అలాంటప్పుడు ఈ ప్రతిపాదన తీసుకురావాల్సిన అవసరం ఏముందని మంత్రులు ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని సూచించారు. సీఎం కూడా అంగీకరించడంతో ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. రాజకీయాల్లో నైతిక విలువలు ముఖ్యమని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. మనకీ, గత ప్రభుత్వానికి తేడా ఏముంటుందని చంద్రబాబు అన్నారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఇది మంచి పద్దతి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంకు చెప్పగా, ఆయన కూడా ఏకీభవించారు. మొత్తం మీద చంద్రబాబు తనదైన స్టైల్లో మంత్రులకు క్లాస్ తీసుకోవడంతో పాటు, పనితీరు మెరుగుపరచుకోకుంటే చర్యలు తప్పవన్నట్లుగా సంకేతాలు పంపారు.