అమెరికాలో సాంకేతిక అంతరాయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సేవలు, ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ నిలిచిపోయి విమానాలు రద్దయిన ఘటనల షాక్ నుంచి తేరుకోకముందే, తాజాగా అమెరికాలోని పలు దిగ్గజ బ్యాంకుల సర్వర్లు కుప్పకూలాయి. అమెరికాలో అతిపెద్ద బ్యాంకు అయిన జేపీ మోర్గాన్ చేజ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, ట్రూయిస్ట్ బ్యాంకుల్లో ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read : ఎన్విడియా వివాదం వేళ భారత్ సంచలన నిర్ణయం.. చైనాకు మాస్టర్ స్ట్రోక్
మొబైల్ యాప్‌లు పనిచేయకపోవడం, ఏటీఎంలలో నగదు విత్‌డ్రా కాకపోవడంతో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ జెల్లే నెట్‌వర్క్‌కు కూడా అంతరాయం కలగడంతో లావాదేవీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఈ భారీ అంతరాయంపై జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ అంతర్గత వ్యవస్థలో తలెత్తిన సిస్టమ్ బగ్ కారణంగానే ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఇతర బ్యాంకులు, జెల్లే వినియోగదారులపైనా దీని ప్రభావం పడిందని వివరించింది.
Also Read : పెద్దలలో టైప్ 1 మధుమేహంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన మార్గదర్శకాలు..!
అయితే ఇది సైబర్ దాడి కాదని, ఖాతాదారుల సొమ్ము సురక్షితంగా ఉందని, సాంకేతిక లోపాన్ని పరిష్కరించి సేవలను తిరిగి పునరుద్ధరించామని బ్యాంక్ వెల్లడించింది. వరుసగా కొద్ది రోజుల వ్యవధిలోనే అమెరికాలో కీలక రంగాలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత వారం మైక్రోసాఫ్ట్ సర్వర్లలో తలెత్తిన లోపంతో అవుట్‌లుక్, టీమ్స్ వంటి సేవలు గంటల తరబడి నిలిచిపోగా, ఆ మరుసటి రోజే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సాంకేతిక లోపంతో అమెరికా వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఏకంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా డౌన్ కావడంతో డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ మూడు ఘటనలకు ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధం లేదని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.


