ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. ఈ కుంభకోణానికి సంబంధించి బుధవారం నాడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 7 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ సోదాల్లో నిందితులకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : అకస్మాత్తుగా పంటి నొప్పా..? ఈ చిట్కాలు పాటించండి..!
ఈడీ దర్యాప్తు వివరాల ప్రకారం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు రద్దు చేస్తూ, మాన్యువల్ మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నిబంధనలను బేఖాతరు చేస్తూ, తన స్నేహితుడికి చెందిన ప్రైవేట్ సంస్థ ‘క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ కు మాన్యువల్ మూల్యాంకన బాధ్యతలను అప్పగించారు.
అధికారిక నిబంధనల ప్రకారం కమిషన్ స్ట్రాంగ్ రూమ్‌లోనే ఉండాల్సిన ఒరిజినల్ జవాబు పత్రాలను, నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్ రిసార్ట్ కు తరలించారు. అక్కడ సుమారు 84 రోజుల పాటు అంటే డిసెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు ఈ ఓఎంఆర్ షీట్లు, జవాబు పత్రాలను ఉంచినట్లు ఈడీ నిర్ధారించింది. అసలు ఎలాంటి నిజమైన మాన్యువల్ మూల్యాంకనం జరగకుండానే, గతంలో డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను తిరిగి ఓఎంఆర్ షీట్లలో నమోదు చేసేందుకు అర్హత లేని 66 మంది వ్యక్తులను రంగంలోకి దించినట్లు గతంలో సిట్ దర్యాప్తులో తేలగా, ఈడీ సైతం ఆ నిధులను మనీలాండరింగ్ కోణంలో నిర్ధారించింది.
Also Read: రెబల్స్ దెబ్బ.. మరి వారి సంగతేంటి సార్..!
చేయని పనికి గానూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థకు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సంతకంతో రూ. 1.14 కోట్ల ప్రభుత్వ నిధులను చెక్కు రూపంలో విడుదల చేశారు. ఈ మొత్తాన్ని ప్రజాధనం దుర్వినియోగంగా మరియు అక్రమ సంపాదన లేదా నేరపూరిత ఆదాయంగా ఈడీ తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు, క్యామ్‌సైన్ మీడియా ఎండీ మధుసూదన్ రావులతో పాటు ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించి, నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ భారీ కుంభకోణంపై ఈడీ తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.


