ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ, మున్సిపల్ ఎన్నికల వేళ అధికార ఎన్డీయే కూటమిలో తిరుగుబాటు అభ్యర్థుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై అత్యంత సుదీర్ఘ చర్చ జరిగింది. కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలు పోటీ చేస్తున్న స్థానాల్లో సైతం తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు రెబల్స్‌గా బరిలో నిలవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : బయట అర్నాబ్ బీభత్సం.. లోపల జగన్ ఆస్తుల లెక్కలు..!
ఈ కేబినెట్ సమావేశంలో మంత్రులనుద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీల అగ్రనాయకత్వం ఎంతో కసరత్తు చేసి సీట్ల సర్దుబాటును ఖరారు చేసిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ‘పొత్తు ధర్మాన్ని’ వందకు వంద శాతం పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, రెండో ఆలోచనకు అస్సలు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యక్తిగత అభ్యర్థులను చూసి కాకుండా, ఎన్డీయే కూటమి సాధించిన సుపరిపాలన, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేస్తారని, ఆ విషయాన్ని క్యాడర్ గుర్తుంచుకోవాలని సూచించారు.
Also Read : కరువు ముప్పు.. కదిలిన రేవంత్ సర్కార్..!
కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎక్కడైనా రెబల్స్ పోటీలో కొనసాగుతుంటే, వారిపై ఏమాత్రం ఉపేక్ష లేకుండా తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చంద్రబాబు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సొంత పార్టీ అభ్యర్థులైనా, మిత్రపక్షాల అభ్యర్థులైనా సరే.. అధికారికంగా బీ-ఫారాలు పొందిన వారి గెలుపు కోసమే కూటమి శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి సీట్లు దక్కించుకోలేకపోయిన అసంతృప్త నేతలను బుజ్జగించి, భవిష్యత్తులో వారికి నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని భరోసా ఇవ్వాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఫైనల్ వార్నింగ్‌తో కూటమిలో రెబల్స్ వేటు పర్వం ఊపందుకోనుంది.


