చేతులు కాలిన తర్వాత.. ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నడుస్తోంది. ఇప్పటికే కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో 17 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. వీటిల్లో 15 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. బీజేపీ, జనసేన అభ్యర్థులు చెరో చైర్మన్ సీటు దక్కించుకున్నారు. ఇక వార్డులు,డివిజన్లలో కూడా టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28 ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నాయి. వైసీపీ 19, సీపీఐ ఒక సీటు, స్వతంత్రులు 5 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.
Also Read : బెంగళూరు ప్యాలెస్‌లో సజ్జల, అవినాష్‌లపై జగన్ చిందులు..?
నిజానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నెలాఖరులో ఉంటాయనే మాట ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బాగా వినిపిస్తోంది. ఇక జూన్ నెల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టడంతో.. అన్ని రాజకీయ పార్టీలు తమ కసరత్తు మొదలుపెట్టాయి. కూటమి పార్టీల నేతలు అయితే సీట్ల పంపకాలపై కసరత్తు మొదలుపెట్టారు. అయితే అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది మాత్రం.. వైసీపీ మాత్రమే. కనీసం రిజర్వేషన్లు కూడా ఖరారు కాక ముందే నెల్లూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించారు. అదే సమయంలో ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని.. ప్రతి చోట వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలని జగన్ ఆదేశించారు.
అయితే ఎన్నికల ప్రకటన వచ్చే సమయానికి వైసీపీ అధినేత జాడ ఎక్కడా కనిపించలేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజున వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత రెండు రోజులకు హడావుడిగా విజయవాడ వచ్చి.. సరిగ్గా 12 గంటలు మాత్రం అటు ఇటూ తిరిగేసి.. మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో వైసీపీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఇదేంటి అన్న.. ఇలా చేశారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అయినా సరే.. జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ నుంచి కాలు బయటపెట్టలేదు. ఇక నామినేషన్ గడువు ముగియడం.. నేతలంతా ప్రచారంలో బిజీగా ఉండటంతో.. ఇప్పుడైనా తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి నేతలతో సమీక్ష చేస్తారని అంతా అనుకున్నారు.
Also Read : ఇళ్లు, ఆస్తులు అన్నీ నావే.. జగన్ ఫ్యామిలీ రాజ్యాంగం
కానీ సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు.. పులివెందుల చేరుకున్నారు వైఎస్ జగన్. కార్యకర్తలతో సమావేశం అయ్యారు. “నేను వచ్చా.. మీకు అండగా ఉంటా..” అని చెప్పారు.. దీంతో.. హమ్మయ్య అనుకున్నారు వైసీపీ నేతలు. కానీ ఇంతలోనే.. “నేను ఎన్నికల ముందు రోజు రాత్రే పులివెందులకు వస్తా.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు కూడా వేస్తా..” అని ప్రకటించారు. ఈ ఒక్క మాటే వైసీపీ నేతల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. అన్న మళ్లీ వెళ్లిపోతాడన్న మాట.. అంటున్నారు. “షర్ట్ మడతపెట్టా.. ఎవరు వస్తారో రండి.. వైసీపీ వాళ్లపై చేయి వేశారంటే.. నా పైన వేసినట్లే.. మా టైమ్ వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఏ అధికారిని వదిలిపెట్టం.. రిటైర్ అయినా తీసుకువస్తాం..” అని చెప్పారు. అంటే.. ఇప్పటి వరకు షర్ట్ ఎందుకు మడత పెట్టలేదు అన్న.. అంటున్నారు సొంత పార్టీ నేతలు. మరికొందరైతే.. ఈ సినిమా డైలాగులు మనకెందుకు అన్న.. కార్యకర్తకు అండగా ఉండకుండా.. బెంగళూరులో ఉంటున్నావు కదా.. అని సెటైర్లు వేస్తున్నారు.


