ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా తమ ఉనికిని చాటుకోవాలని, పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ముమ్మర కసరత్తులు ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఆమె సమాయత్తం చేస్తున్నారు.
Also Read : స్థానిక సమరానికి జగన్ భయపడుతున్నాడా..?
ఎన్నికల నిర్వహణ, వ్యూహాల అమలును మరింత పకడ్బందీగా మార్చేందుకు వైఎస్ షర్మిల 10 మంది సీనియర్ నాయకులతో కూడిన ‘రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ’ని అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది. క్లీన్ ఇమేజ్ మరియు ప్రజాదరణ ఉన్న నాయకులకు, ముఖ్యంగా యువతకు ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని మానిటరింగ్ కమిటీకి షర్మిల స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Also Read : భారీ ఫీచర్లతో మార్కెట్లోకి మారుతి సుజుకి బాలెనొ ఫేస్‌లిఫ్ట్..!
ఎన్నికల విధివిధానాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడంలో ఈ మానిటరింగ్ కమిటీ జిల్లాల వారీగా పర్యవేక్షించనుంది. పార్టీకి చెందిన అన్ని జిల్లాల మరియు నగర అధ్యక్షులు, ఈ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వైఎస్ షర్మిల ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి క్షేత్రస్థాయి ప్రచారం వరకు ప్రతి విషయంలోనూ కమిటీ సూచనలను పాటించాలని, అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఉమ్మడిగా పోరాడి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.

