Thursday, September 10, 2026 08:30 PM
Thursday, September 10, 2026 08:30 PM

స్థానిక సమరానికి జగన్ భయపడుతున్నాడా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న వేళ.. అవి సకాలంలో జరుగుతాయా? లేక ఏదో ఒక కారణంతో వాయిదా పడతాయా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో ‘మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్నారని జగన్ విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం బీసీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిసినా.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందనేది జగన్ ఆరోపణ.

Also Read : బిగ్‌బాస్ 10లో ఎనిమిది వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు? రేసులో ఉన్నది వీళ్లే!

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. తెలంగాణలోనూ ఇలాంటి రిజర్వేషన్లకు సంబంధించి న్యాయ పరమైన అంశాలు తెరపైకి వచ్చిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అదే పరిస్థితి ఏపీలోనూ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం ముందుకు వెళ్తాందని ఆయన ఆరోపించారు. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లపై న్యాయపరమైన వివాదం ఏర్పడితే.. ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావొచ్చన్నది ఆ పార్టీ అంచనాగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇస్తోంది.

స్థానిక ఎన్నికలతో పాటు ఓటర్ల జాబితాల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో సుమారు 44 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రక్రియ.. ఈ మూడు అంశాలు కలి సొస్తే ఎన్నికల నిర్వహణపై న్యాయపరమైన, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని, ఎన్నికల షెడ్యూల్, అధికారిక నిర్ణయాలే తుది విషయాన్ని స్పష్టం చేస్తాయని చెప్పాలి.

మరోవైపు ఎన్నికలు వాయిదా పడతాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. వైసీపీ మాత్రం ఎన్నికలు జరుగుతాయనే అంచనాతోనే ముందుకు సాగాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి రాజకీయ పరిణామాలను తాము చూస్తున్నామని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read : ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ : కార్తి మేజిక్ పనిచేసిందా?

స్థానిక ఎన్నికలను కేవలం పదవుల కోసం జరిగే ఎన్నికలుగా చూడవద్దని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. ఇవి ప్రధానంగా కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని చెప్పారు. భవిష్యత్లో జరిగే ‘కురుక్షేత్రం’ మరింత కీలకమని పేర్కొంటూనే.. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మొత్తానికి.. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా, న్యాయపరమైన అంశాలపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికలు వాయిదా పడతాయన్న జగన్ అంచనా నిజమవుతుందా..? లేక ప్రభుత్వం అనుకున్న సమయానికే ఎన్నికలు నిర్వహిస్తుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చిన్న శ్రీను ఎఫెక్ట్.....

ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతగా ఉన్న...

‘సర్దార్ 2’ మూవీ...

తమిళ హీరో కార్తీ కెరీర్‌లోని ఉత్తమ...

వైసీపీ నుంచి సజ్జల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ...

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు...

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం...

చిన్న శ్రీను షాక్‌…...

విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా భావోద్వేగాల...

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లేడీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా...

పోల్స్