ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ‘సీ ప్లేన్ ప్రాజెక్టు’ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. నీటిపై ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే ఈ వినూత్న విమాన సేవలను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏవియేషన్ సంస్థలు ‘స్కైహోప్ ఏవియేషన్’, ‘మె హెయిర్’ అధికారికంగా ముందుకొచ్చాయి. ఈ రెండు ప్రైవేట్ ఆపరేటర్ల ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : కేసీఆర్ ‘ప్రతిపక్ష’ కుర్చీకి రేవంత్ రెడ్డి ఎసరు..?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ స్కీమ్ కింద ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుండటంతో ఆపరేటర్లకు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక చేయూత కూడా లభించనుంది. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా విమానాల రాకపోకలకు అవసరమైన ‘వాటర్ డ్రోమ్‌ల’ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వీటి మౌలిక వసతుల కల్పన కోసం త్వరలోనే అధికారికంగా టెండర్లు పిలవడానికి ఏపీటీడీసీ అంతా సిద్ధం చేసింది.
Also Read : డీఎస్సీ వార్.. ఆరోపణలు సరే.. ఆధారాలేవి..?
ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో వాటర్ డ్రోమ్ నిర్మాణానికి సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు కానుందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పది ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ మినీ ఎయిర్‌పోర్టుల మౌలిక సదుపాయాలను సరికొత్తగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా కనెక్టివిటీ మరియు పర్యాటక పరంగా అత్యంత అనుకూలంగా ఉన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్, విశాఖపట్నం, మరియు శ్రీశైలం వంటి ప్రముఖ క్షేత్రాల మధ్య ఈ సీ ప్లేన్ సేవలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు తిరుపతి పరిధిలోని రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు పరిధిలోని జోలాపుట్, లంబసింగి సమీపంలోని తాజంగి రిజర్వాయర్, మరియు పోలవరం ప్రాంతాల్లో కూడా వీటి నిర్వహణకు వాటర్ డ్రోమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

