ఉత్తరాంధ్రకు మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయ్యింది. అలాగే త్వరలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉత్తరాంధ్రలో వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Also Read : ఆగస్టు 24 నుండి కొత్త సిమ్ రూల్స్.. ఆ లిమిట్ దాటితే మీ నంబర్లు బ్లాక్..!
శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట పోర్టు సమీపంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ రసాయన పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఫాస్ఫరిక్ యాసిడ్, అనుబంధ ఎరువుల తయారీ కాంప్లెక్స్ ఏర్పాటుకు 450 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సుమారు రూ.2,250 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రారంభ దశలోనే 400 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రోజుకు2,000 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్, 650 టన్నుల ఫాస్ఫరిక్ యాసిడ్, 1,000 టన్నుల జిప్సమ్ ప్లాస్టర్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
2030 అక్టోబర్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. మూలపేటలో భారీ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, వ్యాపారాలు, రవాణా, సేవా రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. దీని ద్వారా మూలపేటతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. కోరమండల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 450 ఎకరాల భూమిని కేటాయించడంతో జిల్లాలో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి వచ్చినట్లైంది.
Also Read : మెగా బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఊరమాస్ గ్లింప్స్ రిలీజ్..!
పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక ముందడుగు కానుంది. మూలపేటలో కోరమండల్ పరిశ్రమ ఏర్పాటు శ్రీకాకుళం జిల్లా పారిశ్రామిక ప్రగతికి చారిత్రాత్మక ముందడుగు. రూ.2,250 కోట్ల పెట్టుబడులతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది. పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

