తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటింది. ఏడాది క్రితం నుంచే మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ పేరుతో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అలాగే మంత్రి పదవుల కోసం ఆశావహుల జాబితా కూడా పెద్దగానే ఉంది. సీనియర్లతో పాటు వలస నేతలు కూడా మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొందరు నేతల మధ్య ఇప్పటికే మంత్రి పదవి వార్ మొదలైంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అయితే పదవి కోసం ప్రయత్నాలు.. అవకాశం ఉన్నప్పుడు విమర్శలు చేస్తున్నారు కూడా.
Also Read : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందనే రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన ప్రాధాన్యం దక్కలేదనే భావన చాలా మంది నేతల్లో నెలకొంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత విజయశాంతికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని ప్రచారం జరిగింది. ఇది నిజమేనని హైకమాండ్ కూడా ఒప్పుకుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. హోంమంత్రి పదవి ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, సోనియాగాంధీకి అత్యంత దగ్గరి వ్యక్తిగా విజయశాంతికి పార్టీలో పేరుంది.
Also Read : టీడీపీలో ప్రక్షాళన.. వారికి గేట్ క్లోజ్..!
సీనియర్ కావడం కూడా కలిసి వచ్చే అంశమని అందరూ భావించారు. కొద్ది రోజుల్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు ఆ మాట నిజం కాలేదు. ప్రస్తుతం విజయశాంతి మౌనం దాల్చారు. తన సన్నిహిత రాజకీయ నేతల మధ్య తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందని కావాలనే కొంతమంది రాష్ట్ర నేతలు తాను మంత్రిగా కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పినట్లు తెలిసింది. అందువల్లే తాను మౌనంగా ఉంటున్నానని, మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఎక్కడా చేయలేదు. ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం రాజీనామా అంశానికి బలాన్ని చేకూర్చుతున్నది.

