గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ చివరిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు గదిలో భారీ దొంగతనం జరిగిన దగ్గర నుంచి ఈ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హెడ్ క్లర్క్ రవికుమార్ దాదాపు 72,000 రూపాయలు దొంగలించే ప్రయత్నం చేయగా టీటీడీ అధికారులు పట్టుకున్నారు. దీనితో అప్పుడు రవికుమార్ తాను చేసిన తప్పుకు క్షమాభిక్ష కూడా కోరాడు. అయితే ఆ సమయంలో ఈ కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీకి వచ్చింది.
Also Read : కొత్త జిల్లాలు.. మారనున్న సరిహద్దులు..!
దీని వెనక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీనిపై అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి. రవికుమార్ పేరు మీద ఉన్న ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించడం, మిగిలిన ఆస్తుల్లో రాజకీయ నాయకుల ప్రమేయం వంటివి తీవ్ర విమర్శలకు దారితీసాయి. అయితే హుండీ లెక్కింపుల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై అత్యున్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Also Read : ఆర్టీసీ బస్సు తప్పింది.. కావేరి బలైంది.. కర్నూలు ఘటనలో సినీ ఫక్కీ సీన్లు
టీటీడీ పరకామణిలో చోరీ కేసు పై ఏపీ హైకోర్టులో కాసేపటి క్రితం విచారణ జరిగింది. అత్యవసరంగా సి బి సి ఐ డి తో విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ రెండు నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖతోపాటుగా ఏపీ డీజీపీకి కూడా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అలాగే లోక్ అదాలత్ లో పరకామణి కేసు రాజీ చేసిన న్యాయమూర్తి పై కూడా చర్యలు చేపట్టాలని సూచించింది. గతంలో టిటిడి చైర్మన్ గా పని చేసిన వారితోపాటుగా అప్పుడున్న అధికారులపై కూడా లోతుగా విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.




