ఏపీలో ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే రాజధాని నిర్మాణం. 2027 నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రతి సందర్భంలో చెబుతున్నారు. కేంద్రం సహకారంతో.. అనుకున్న సమయానికి పూర్తి చేస్తామంటున్నారు కూడా. మరోవైపు ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కూడా. అమరావతి పనులను నారాయణ పరుగులు పెట్టిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం.. ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
Also Read : డిజిటల్ బుక్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు
అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని కింది స్థాయి అధికారి మొదలు.. సీఎం వరకు ప్రతి రోజు చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో అమరావతిలో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని కూడా అంటున్నారు. ఇక అదే సమయంలో అమరావతిలో పలు సంస్థలకు స్థలాలు కూడా కేటాయిస్తున్నారు. అయితే అసలు అమరావతి పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్నకు జవాబు మాత్రం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలు తప్ప.. అమరావతి పరిస్థితి ఇలా ఉంది అని ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇక అమరావతి పనులు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ రీజినల్ కార్యాలయం ప్రారంభం కూడా ఇప్పుడు ఈ అనుమానాలకు కేంద్ర బిందువుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ.. ఏపీ సీఆర్‌డీఏ.. అమరావతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఈ కార్యాలయం విజయవాడ నగరంలోని లెనిన్ సెంటర్‌లో పాత వీజీటీఎం కార్యాలయంలో కొనసాగుతోంది. అయితే అమరావతి పనులు పర్యవేక్షిస్తున్న సంస్థకు శాశ్వత భవనం ఉండాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నదే ఆలస్యం 2017లోనే నిర్మాణం ప్రారంభించారు. 2019 నాటికి 70 శాతం పనులు కూడా పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారిపోవడంతో పనులకు బ్రేక్ పడింది. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగం అందుకున్న మాట వాస్తవం. ఇక గతేడాది నవంబర్‌లో సీఆర్‌డీఏ కార్యాలయ పనులను తిరిగి ప్రారంభించారు చంద్రబాబు. వంద రోజుల్లో పూర్తి చేస్తామని గొప్పగా ప్రకటించారు కూడా. ఆ తర్వాత ఉగాది నాటికి భవనం రెడీ అన్నారు. ఆ తర్వాత ఆగస్టు 15 నాటికి ప్రారంభం అన్నారు. తూచ్ అవేవీ కాదు.. అక్టోబర్ 2న దసరా పండుగకు ఓపెనింగ్ పక్కా అని చెప్పేశారు.
Also Read : బ్రేకింగ్: తెలంగాణలో టీడీపీ యాక్షన్ రీస్టార్ట్.. చంద్రబాబు కీలక సమావేశం
ఉగాది, ఆగస్టు 15, దసరా అంటూ వాయిదాలు వేశారు తప్ప.. సీఆర్‌డీఏ రీజినల్ కార్యాలయం మాత్రం ప్రారంభం కాలేదు. తాజాగా అక్టోబర్ 13న ప్రారంభమంటూ సోషల్ మీడియాలో మరో తేదీ ట్రోల్ అవుతోంది. దీంతో అసలు ఇది సాధ్యమేనా అనే మాట బాగా వినిపిస్తోంది. మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న భవనమే ఇంత ఆలస్యం అవుతుందేమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా సీఆర్‌డీఏ అధికారుల తీరుపై సెటైర్లు వేస్తున్నారు కూడా. ఈ ముహుర్తం అయినా బలంగా ఉందా.. లేక మళ్లీ వాయిదా వేస్తారా.. అని పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి సీఆర్‌డీఏ భవనానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేశారు. దీనిపై కూడా ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అమరావతి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులే ఇంత ఆలస్యం అవుతుంటే.. మరి మిగిలిన భవనాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.