ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతున్న కొద్దీ, దీని ద్వారా తయారవుతున్న కంటెంట్ వల్ల తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, నకిలీ వార్తలు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్యక్షుడు నిశికాంత్ దూబే నేతృత్వంలో కీలక సిఫారసులు చేసింది.
లైసెన్స్ & లేబులింగ్ తప్పనిసరి
కమిటీ నివేదిక ప్రకారం, భవిష్యత్తులో ఎవరైనా AI ఆధారిత వీడియోలు, ఆర్టికల్స్ లేదా పోస్ట్‌లు రూపొందించాలంటే ప్రత్యేక లైసెన్స్ అవసరం అవుతుంది. అంతేకాక, AI ద్వారా సృష్టించబడిన కంటెంట్‌పై స్పష్టమైన “AI Generated” లేబుల్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠినమైన చట్టపరమైన, సాంకేతిక చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. తప్పుడు కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా వ్యాప్తిచేసే వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలని సూచించింది.
Also Read : ఐటీ రిటర్న్ కు నేడే లాస్ట్ డేట్.. జరిమానా ఎంతంటే..!
ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వశాఖ (MeitY) డీప్‌ఫేక్‌లపై ప్రత్యేక 9 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నకిలీ వాయిస్, మానిప్యులేటెడ్ వీడియోలను గుర్తించేందుకు కొత్త టూల్స్ అభివృద్ధి చేస్తోంది. అమలులో భాగంగా సమాచార & ప్రసార మంత్రిత్వశాఖతో పాటు ఇతర శాఖలు కూడా సమన్వయం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. Advertising Standards Council of India (ASCI) ఇప్పటికే ఒక గైడ్‌లైన్ జారీ చేసింది. దాని ప్రకారం, ప్రకటనలు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్ AI ద్వారా తయారైతే దానిని తప్పనిసరిగా వెల్లడించాలి.
శిక్షలు మరియు నిబంధనలు
కమిటీ నివేదికలో, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన జరిమానాలు, క్రిమినల్ లయబిలిటీ విధించాలని సిఫారసు చేసింది. అలాగే మీడియా సంస్థల్లో ఫ్యాక్ట్ చెకింగ్ తప్పనిసరి చేయడం, అంతర్గత ఓంబుడ్స్‌మన్ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సిఫారసులు అమల్లోకి వస్తే డిజిటల్ కంటెంట్ రంగం మరింత నియంత్రణలోకి వస్తుంది. ఒకవైపు తప్పుడు సమాచారాన్ని నియంత్రించగలిగే వీలుంటే, మరోవైపు సృజనాత్మకత, స్వేచ్ఛాపరమైన భావ వ్యక్తీకరణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.