తెలుగు దేశం పార్టీ గుంటూరు ఎంపీగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గళం వినిపించిన పార్లమెంట్‌లో కీలక నేతగా గల్లా జయదేవ్‌కు టీడీపీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైతం ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. ఉన్నత విద్య, సమగ్ర వ్యాపార పాఠాలు, విలువలు కలిగిన రాజకీయ విధానంతో, పార్టీకి నిబద్ధతతో, పార్టీ అధినేత నమ్మకాన్ని పొందిన నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు. గల్లా కుటుంబ వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన జయదేవ్ అనతికాలంలోనే ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. పార్లమెంటులో ఆనాడు మోడీ పై చేసిన ప్రసంగం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : బిగ్ బాస్ అరెస్టు ఖాయమా..?
2019 ఎన్నికలలో వైసీపీ జోరును తట్టుకొని మరోసారి గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా, అనంతరం వైసీపీ పాలనలో కక్షపూరిత రాజకీయాల వల్ల ఆర్థికంగా నష్టపోయారు. ముఖ్యంగా అమర రాజా బ్యాటరీస్ సంస్థపై తగిన విధానం లేకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా, ఆ పరిశ్రమను ఏపీ నుంచి హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో, 2024 సాధారణ ఎన్నికల నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయక, పూర్తిగా వ్యాపార కార్యక్రమాలపై దృష్టి సారించారు. అయితే, కూటమి విజయంతో టీడీపీకి కేంద్రంలో మద్దతు పెరిగిన సమయంలో, గల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నా, పార్టీకి మాత్రం దూరం కాలేకపోతున్నారు.
Also Read : రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై.. తపాలా శాఖ కీలక నిర్ణయం..!
తాజాగా కాణిపాకం వినాయకుని దర్శించుకున్న గల్లా జయదేవ్, తన పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “దేవుడు కరుణిస్తే తిరిగి అవకాశం వస్తే, రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాను” అంటూ, ఇప్పటికే పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో గల్లా జయదేవ్ రాజ్యసభకు వెళ్ళనున్నారా? అనే చర్చ రాజకీయం వర్గాల్లో చెలరేగుతోంది. ఇప్పుడున్న రాజకీయ పొత్తుల నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చంద్రబాబు ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? గల్లా కోసం టీడీపీ రాజ్యసభ ద్వారం తెరుస్తుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారిన అంశం.