వచ్చిందే 11 స్థానాలు.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం కూడా చెల్లడం లేదు. వస్తే… గతంలో చేసిన తప్పులు ఎత్తి చూపుతారనే భయంతో కుంటిసాకులతో ముఖం చాటేస్తున్నారు. ఇదంతా ప్రజలకు తెలిసిన విషయం. కానీ తమ పార్టీకి ప్రజల్లో ఇంకా బలం ఉందని.. తమ ఓటర్లు వేరేగా ఉన్నారనే సజ్జల మాటలు నిజం చేసేలా వైసీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. అసలు తమ అధినేత ఎక్కడికి వెళితే అక్కడ జనం తండోపతండాలుగా వస్తున్నారంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. రెండు రోజుల వ్యవధిలో జగన్ గురించి సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు చేస్తున్న హంగామా మామూలుగా లేదు.
Also Read : వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!
ఇంకా చెప్పాలంటే… ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందనేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హజరయ్యారు. తెనాలిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. వధువరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. యధాతధంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక కొందరైతే.. ఐ ప్యాక్ ఎలివేషన్స్ తూచా తప్పకుండా పాటించారు. జగనన్న అంటూ కొందరు.. దేవుడు అంటూ కొందరు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. కానీ వాస్తవానికి ఈ వేడుక ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. అక్కడికి వెళ్తున్న మార్గం చాలా ఇరుకు. ఆ దారిలో జగన్ వస్తున్నట్లు ముందుగానే వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్ కావడంతో.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తెనాలి వచ్చారు.
Also Read : చిరంజీవి – అనీల్ రావిపూడి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదే
సరిగ్గా అదే సమయంలో జగన్ రావడంతో జనమంతా ఒకేచోట చేరడంతో.. వచ్చిన వాళ్లంతా జగన్‌ను చూసేందుకు వచ్చారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆ వేడుకకు పార్టీలకు అతీతంగా తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల ప్రజలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ విషయం ఏ మాత్రం మింగుడు పడని వైసీపీ నేతలు.. మంగళగిరిలో జరిగిన ఒక వివాహానికి లోకేష్ వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్‌కే ఎక్కువ మంది అభిమానులున్నారని.. లోకేష్‌ను చూసేందుకు ఎవరు రాలేదని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వధువు తండ్రి ఓ గ్రామ స్థాయి నాయకుడు. ఆయనకు ఉన్న పరిచయాలు అంతంత మాత్రమే.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
అయినా తన విజయానికి పని చేసిన నాయకుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుండటంతో హడావిడి లేకుండా వివాహానికి హాజరైన లోకేష్ జంటను ఆశీర్వదించి వెళ్లిపోయారు. మరోవైపు ప్రకాశం జిల్లా మేదరమెట్ల వెళ్లాడు జగన్. వైసీపీ ఎంపీ, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ వయోభారంతో మృతి చెందారు. దీంతో ఆ పార్థివ దేహానికి జగన్ నివాళి అర్పించారు. ఇందుకోసం తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో మేదరమెట్ల చేరుకున్నారు జగన్. ఆ సమయంలో కూడా మేదరమెట్లకు పెద్ద ఎత్తున వచ్చిన జనం.. కేవలం జగన్‌ను మాత్రమే చూసేందుకు వచ్చారని వైసీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరున్న రాజకీయ నేత. గతంలో ఒంగోలు ఎంపీగా కూడా పని చేశారు.
Also Read : రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రైళ్లు సికింద్రాబాద్ కు రావు..!
ఆ సమయంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు అటు నెల్లూరు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. అలాగే వైవీ సుబ్బారెడ్డి సోదరి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి. దీంతో బాలినేని అనుచరులు కూడా పెద్ద ఎత్తున మేదరమెట్లలోని వైవీ నివాసానికి వచ్చారు. పల్లెటూరు కావడంతో ఇరుకు సందులు. దీనినే తమకు అనుకూలగా మలుచుకున్న వైసీపీ నేతలు.. జగన్ కోసం జనం వచ్చారని.. జగన్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారని.. 9 నెలల కూటమి పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన సందర్భం ఏమిటీ.. వైసీపీ నేతలు చేస్తున్నదేమిటీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చావును కూడా వైసీపీ తమ ప్రచారానికి వాడుకుంటోందని విమర్శిస్తున్నారు.