తిరుమల పవిత్రత కాపాడటంలో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చూపించిన “శ్రద్ధ” ఇప్పుడు సిట్ ఛార్జ్‌షీట్ రూపంలో ఊరూరా మారుమోగుతోంది. సాధారణంగా పాల నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు, కానీ “పాలు లేకుండా నెయ్యి” తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది అనే మాట బాగా వినిపిస్తోంది. సైన్స్ క్లాసుల్లో కూడా ఎవరూ చెప్పని ఈ ‘సింథటిక్ మ్యాజిక్’ చూస్తుంటే.. కేవలం రాజకీయం మాత్రమే కాదు, భక్తుల నమ్మకాన్ని కెమికల్స్‌తో కలిపేసిన అద్భుతమైన కెమిస్ట్రీ కూడా ప్రదర్శించారని అర్థమవుతోంది! టీటీడీ చైర్మన్‌గా ఉన్నారా లేక ఏదైనా “కెమికల్ ఫ్యాక్టరీ”కి మేనేజర్‌గా ఉన్నారా అన్న సందేహం వస్తోంది.
Also Read : కేంద్ర బడ్జెట్ ప్రభావం: మార్కెట్లకు ముప్పేనా?
కానీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన భక్తి ప్రపత్తులు కోర్టు మెట్లు ఎక్కే దగ్గర చూపించిన వేగం! ఏ తప్పు చేయకపోతే ఆయనతో పాటు ఆయన ధర్మపత్ని బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులకు సమర్పించకుండా స్టే కోసం కోర్టుకు ఎందుకు పరిగెత్తారనే విషయం సుబ్బారెడ్డి వివరిస్తారో లేదో చూడాలి. నిజాయితీ ఉంటే భయం ఎందుకు? ఆ వివరాలు సిట్ అధికారులకు ఇచ్చేస్తే.. ఏ తప్పూ చేయలేదని, అంతా వెంకన్న సాక్షిగా ధర్మబద్ధంగా జరిగిందని మైకుల ముందు వైసీపీ నేతలు గంభీరంగా చెబుతారు కదా! మరి ఆ ఖాతాల్లోకి ఎక్కడి నుండి నిధులు వచ్చాయి, ఎక్కడికి వెళ్లాయి అనే చిన్న స్టేట్‌మెంట్ చూపించడానికి అంత వణుకు ఎందుకు? అనే ప్రశ్నలకు సుబ్బారెడ్డి జవాబు చెప్పాల్సి ఉంది.
పురాణాల్లో తన రాకను విష్ణువు గమనించలేదని భావించిన భృగు మహర్షి, తీవ్రమైన కోపంతో విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి కోపగించుకోకుండా, మహర్షి పాదాలు నొచ్చుకుని ఉంటాయని మెల్లగా ఒత్తుతూ, ఆయన పాదంలో ఉన్న ‘అహంకారపు కన్ను’ చిదిమేశారు. కానీ సుబ్బారెడ్డి మహర్షి కాదు, భృగువులు అంతకంటే కాదు! ఈ విషయంలో ఆ శ్రీహరి అంత మెల్లగా అస్సలు ఉండడు. సుబ్బారెడ్డి పాదాల కింద ఉన్నది ‘అహంకారపు కన్ను’ కాదు, అవినీతి పుట్ట! ఆ పుట్ట పగిలే రోజు దగ్గరలోనే ఉందనేది టీడీపీ నేతల మాట.
Also Read : వీణ రాగాలకు మాయమైన మద్దతు..!
ఆ లింకులు ఎక్కడివి? నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు, వైవీ కుటుంబ సభ్యుల ఖాతాలకు మధ్య ఏమైనా “అదృశ్య వారధి” ఉందా అని భక్తులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాన్ని పటాపంచలు చేయాల్సింది పోయి, కోర్టు ద్వారా నోరు నొక్కాలని చూడటం వైవీ నైతికతకు నిదర్శనం. ప్రైవసీ ముసుగులో ఏముంది? కోర్టులో “మా వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది” అని వైవీ వింత వాదన చేశారు. స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వు, పామాయిల్ కలిసినప్పుడు దెబ్బతినని పవిత్రత.. బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే దెబ్బతింటుందా?.. అనేది కీలక ప్రశ్న.
నిజానికి వైసీపీ హయాంలోనే కల్తీ జరుగుతోందని అధికారులు రిపోర్టులు ఇచ్చినా కూడా వైవీ సుబ్బారెడ్డి ఎందుకు లైట్ తీసుకున్నారు? బహుశా “అంతా మన వాళ్లే కదా, కొంచెం ఆయిల్ కలిపితే లడ్డూ ఇంకా సాఫ్ట్‌గా వస్తుంది” అని అనుకున్నారేమో! ఆవు పాలు లేని నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు వందల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టడం అసలు పాపానికి పరాకాష్ట. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో.. ఆవు నెయ్యికి బదులు పామాయిల్, కెమికల్స్ కలిపి “అరోమా” కోసం ఎసెన్స్ వాడిన ఘరానా తెలివి చాలా గొప్పది. అంటే భక్తులకు ఇచ్చింది ప్రసాదం కాదు, ఒక “కెమికల్ కాక్ టెయిల్” అన్నమాట! ప్రసాదంలో పవిత్రత కంటే “కమీషన్లే” ముఖ్యమని సిట్ ఛార్జ్‌షీట్ చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది.
Also Read : అప్పుడు అత్యాశ పడ్డారు.. ఇప్పుడు బోల్తా పడ్డారు..!
సాధారణంగా భక్తులు స్వామివారికి తమ సంపాదనలో కొంత సమర్పిస్తారు. కానీ వైసీపీ హయాంలో మాత్రం.. స్వామివారి సొమ్మును, భక్తుల సెంటిమెంట్‌ను తమ వైపు మళ్లించుకునే సరికొత్త సవరించిన నిబంధనలతో “పవిత్రతను రివర్స్ చేసే టెండరింగ్” విధానాన్ని జగన్ సర్కార్ ప్రవేశపెట్టగా.. దానిని వైవీ సుబ్బారెడ్డి తూచా తప్పకుండా అమలు చేశారు. అన్నీ బయటపడ్డాక కూడా “ఇదంతా రాజకీయ కక్ష” అని బుకాయించడం వైసీపీ నేతలకే చెల్లింది. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడే సరైన “జడ్జిమెంట్” ఇస్తాడంటున్నారు టీడీపీ నేతలు. ఇక కల్తీ నెయ్యిలో భాగస్వామిగా ఉన్నందుకే పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకును ధర్మారెడ్డి కోల్పోయాడని.. గుర్తు చేస్తున్నారు. “వైవీ గారూ, గుర్తుంచుకోండి.. కోర్టుల నుండి స్టేలు తెచ్చుకోవచ్చు కానీ, ఆ ఏడుకొండల వాడి నుండి వచ్చే ‘తీర్పు’ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఎలా ఉంటుందో కూడా మీ ఊహకు అందదు. అప్పుడు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లు కాదు కదా, మీ మౌనం, మీ వెనుక జగన్, ఆయన వెనుక వైసీపీ కూడా మిమ్మల్ని కాపాడలేవు.” అంటూ టీడీపీ నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాల పెద్దలు, శ్రీవారి భక్తులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

