“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల కోసం ఎదురుచూసేది ఎవరు..? వైసీపీలో జగన్ ముందున్న అసలు సవాల్ ఇదే..! వైసీపీ నేతల తీరుపై జగన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత పార్టీలో భారీ మార్పులుంటాయనే అనుమానాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టికెట్లు, ఆర్థిక స్థోమతపై నేతల వ్యాఖ్యలు.. జిల్లా నాయకత్వంపైన కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ కష్టకాలంలో అండగా నిలవాల్సిన నేతలు.. తమకు ఆర్థిక సహకారం అందిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తామనే ధోరణిలో మాట్లాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. కొందరు నేతలైతే.. అధికారంలో ఉన్న ఐదేళ్లు మాకు సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదు.. మళ్లీ ఇప్పుడు ఖర్చు పెట్టమని ఆదేశిస్తే.. ఎక్కడ నుంచి తెచ్చి పెడతామని నిలదీస్తున్నట్లు సమాచారం. ఇది పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read : రాహుల్ దెబ్బ.. కేంద్రంలో కలకలం..!
అయితే పార్టీ పెద్దల మాట మాత్రం మరోలా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాజకీయంగా ఎదిగిన పలువురు నేతలు నేడు కీలక స్థానాలకు చేరుకున్నారంటున్నారు. ఒకప్పుడు సాధారణ స్థితిలో ఉన్న కొందరు నాయకులు ప్రస్తుతం ఆర్థికంగా బలపడటంతో పాటు రాజకీయంగా కూడా గుర్తింపు పొందారు. అయితే పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అధిష్ఠానానికి అండగా నిలవాల్సిన బాధ్యత నాయకులపై లేదా అని పార్టీ ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున ఎవరికి ఏ అవకాశాలు కల్పించారు..? ఎవరిని రాజకీయంగా ప్రోత్సహించారు..? ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగించారు? అనే అంశాలపై ఆయా నేతలకు స్పష్టమైన అవగాహన ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో వైసీపీ ద్వారా రాజకీయంగా ఎదిగిన నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యతలను గుర్తించాలని క్యాడర్లోని కొందరు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేవంటూ కొందరు నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపికపై జగన్ స్వయంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు అంశాలపై స్వయంగా దృష్టి సారిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాల నాయకత్వం పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న విధానాలు, పార్టీ బాధ్యతలు చేపట్టిన నాయకుల వ్యవహారశైలి వంటి అంశాలు జగన్ దృష్టికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి ఎవరు కృషి చేస్తున్నారు..? ఎవరు పార్టీకి ఉపయోగపడుతున్నారు..? అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి..? అనే అంశాలపై అధినేత సమీక్ష చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read : ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల సమరం.. అసలు మేటర్ ఏంటీ..?
స్థానిక ఎన్నికల తర్వాత వైసీపీలో కీలక మార్పులు ఉంటాయంటున్నారు ఆ పార్టీ ముఖ్యనేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన అనంతరం జిల్లాల నాయకత్వంలో, నియోజకవర్గ ఇన్ఛార్జుల బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కొనసాగించే నేతలకు బాధ్యతలు అప్పగించే దిశగా నిర్ణయాలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నాయకత్వ మార్పులు, ఇన్ఛార్జుల మార్పులపై వైసీపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వీటిని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చగానే చూడాలి.
స్థానిక ఎన్నికలు వైసీపీకి కేవలం అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు.. పార్టీ నాయకత్వం పనితీరు, క్షేత్రస్థాయి బలం, నేతల నిబద్ధతకు పరీక్షగా మారనున్నాయా..? అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయితే ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన పార్టీ నేతలకు ఓ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాదని.. ఓటు షేర్ ముఖ్యమని సూచించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అది 45 శాతం దాటాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ దిశగా నేతలంతా కష్టపడాలని ఆదేశించినట్లు సమాచారం.


