కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడి ముమ్మరం చేశారు. ప్రధానంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ ముప్పేట దాడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేస్తున్న విమర్శనాస్త్రాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో 200 మంది అధికారులు తనతో టచ్లో ఉన్నారని చెబుతూ రాహుల్ వదిలిన గాసిప్ ద్వారా కేంద్ర పెద్దలను ఉలికిపాటుకు గురిచేసే వ్యూహం దాగుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ వ్యాఖ్యలను కేంద్రం తేలిగ్గా తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రమాదమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : వైసీపీని తుడిచేస్తున్న చిన్న శ్రీను.. ఉత్తరాంధ్రలో భారీ దెబ్బ..!
ఓట్ చోరీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం మీదుగా ఎన్డీఏ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. ముందు ఎన్నడూ లేని స్థాయిలో నాయకత్వ లక్షణాలు కనబరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 6న సీఈసీకి వ్యతిరేకంగా మొదలైన క్షేత్రస్థాయి యుద్ధాన్ని అంచెలంచెలుగా పట్టుబిగిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసే వరకు చేరుకుంది. రాహుల్ను కలిసేందుకు సీజేఐ అపాయింట్మెంటు ఇవ్వకపోయినప్పటికీ, ఆయన ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలు అయిన సీబీఐ, ఈడీ, విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన 200 మంది అధికారులు తనతో టచ్లో ఉన్నారని చెప్పడం ద్వారా కేంద్రం లొసుగులు అన్నీ తనకు తెలుసు అని హెచ్చరిస్తున్నారని అంటున్నారు. నిజానికి అధికారులు రాహుల్తో టచ్లో ఉన్నా లేక పోయినా కూడా.. ఆయన చెప్పిన విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని, ప్రజల్లో కేంద్రంపై అనుమానాలు పెంచేలా వ్యూహాత్మకంగా ముందడుగు వేశారని పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో అధికారులు విపక్షాలతో చేతులు కలపడం జరుగుతుంటుందని, రాహుల్ కూడా ఇదే వ్యూహాన్ని ఎంచుకుని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కష్టాల్లో ఉన్నట్లు ప్రచారం చేసేందుకు అధికారులు తనతో టచ్లో ఉన్నారనే మాట చెబుతున్నారని అంటున్నారు.
Also Read : ఏ1, ఏ2ల నోట Gen Z మాట.. నవ్వుకుంటున్న యువత
ఇదే సందర్భంలో తమతో పాటు సీఈసీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాక్రోచ్ పార్టీ కార్యకర్తల దృష్టిని ఆకర్షించేలా రాహుల్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సైతం ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం అంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీజేపీతో కూడా తాను కలవడానికి సిద్ధం అన్నట్లు రాహుల్ సంకేతాలు పంపి యువత దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక మొత్తం వ్యవహారంలో రాహుల్ చుట్టూ జాతీయ రాజకీయాలు తిరుగుతుండగా, అధికార బీజేపీ దీటుగా జవాబు చెప్పలేకపోతోందని అంటున్నారు.


