రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి పుట్టించే వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజా రిజర్వేషన్ల ప్రకారంగా జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని ఓసీ మహిళకు కేటాయించడంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటివరకు తెర వెనుక ఉండి వ్యూహాలు రచించిన నియోజకవర్గ పొలిటికల్ దిగ్గజాలు, ఇప్పుడు తమ సతీమణులను నేరుగా ఎన్నికల బరిలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు.
Also Read : వంశీ.. నువ్వు ఎవరి తాలుకానో తెలుసా..!
ఈ సరికొత్త పొలిటికల్ ఫైట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ, అలాగే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణమ్మ మున్సిపల్ చైర్మన్ స్థానానికి పోటీ పడనున్నారనే ప్రచారం క్షేత్రస్థాయిలో జోరందుకుంది. దీనితో ఒక్కసారిగా సీమలో హీట్ పెరిగింది. జమ్మలమడుగు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఉన్న సాంప్రదాయ రాజకీయ వైరం, ఇప్పుడు వారి సతీమణుల ప్రత్యక్ష పోటీతో మరింత రసవత్తరంగా మారనుంది.
Also Read : వివేకా కేసులో.. వచ్చే వారం నుంచి కీలక అరెస్టులు..?
జమ్మలమడుగు పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఒకవైపు సి.ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో కూటమి తరఫున అరుణమ్మను గెలిపించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, క్షేత్రస్థాయిలో బలాన్ని నిరూపించుకోవాలని సి.రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సతీమణుల సమరంలో జమ్మలమడుగు మున్సిపల్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


