ఏం జరిగినా సరే… మేమే చేశాం.. మా వల్లే జరిగింది అని చెప్పుకోవడంలో ఉన్న కిక్కు మరెక్కడా రాదు. అలా చెప్పుకోవడంలో వైసీపీ నేతలు ముందుంటారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా సరే… మా జగనన్న ఎప్పుడో చేసేశాడు.. అదే ఇప్పుడు మీరు చేస్తున్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. పథకాల అమలు మొదలు.. ఎన్నో విషయాల్లో జగన్‌ను కూటమి ఆదర్శంగా తీసుకుందనేది వైసీపీ నేతల మాట. అయితే దీనికి కూటమి పార్టీ నేతల కూడా అంతే ధీటుగా జవాబిస్తున్నారు. దీంతో అసలు నిజమేమిటో జనాలకు ఇట్టే తెలిసిపోతోంది.
Also Read :యూట్యూబ్ లో తప్పుడు ప్రచారం.. టీటీడీ రియాక్షన్
ఏపీలో వాట్సప్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. వాట్సప్ ద్వారా ఏకంగా 164 సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత మెటా ప్రతినిధులతో కలిసి మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా 9552300009 నంబర్‌ను ఏర్పాటు చేశారు. జస్ట్ వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు… ఆలయాలు, పౌర, ఆర్టీసీ… ఇలా 164 సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. దాదాపు ఏపీలో 84 శాతం మంది ప్రజలు వాట్సప్ వినియోగిస్తున్నారనేది సర్వే రిపోర్టు. కాబట్టి… ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఎలాంటి అదనపు చెల్లింపులు అవసరం లేదంటూ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Also Read : ఏపీలో అన్నీ ఇక వాట్సాప్ లోనే…!
నిజానికి ఇది ప్రజలకు ఎంతో ఉపయోగమైన అంశం. అయితే ఇదే విషయాన్ని వైసీపీ నేతలు తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. నిజానికి ఈ పథకం 2023లో జగన్ ప్రారంభించాడు. అయితే అప్పుడు జస్ట్ బటన్ నొక్కడంతోనే సరిపెట్టారు జగన్. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైందో వైసీపీ నేతలకు కూడా తెలియదు. ఆ సేవలు ఎందుకు ఆగిపోయాయో కూడా తెలియదు. సేవలు ప్రారంభిస్తే.. ప్రజలకు తెలియాలి. కానీ ఒక్కరు కూడా వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలు వినియోగించుకున్న ఆనవాళ్లు లేవు. అంతెందుకు వైసీపీ నేతలకే ఆ విషయం అస్సలు తెలియదు. వలంటీర్ల ద్వారా సేవలందిస్తున్నామని చెబుతున్నారు తప్ప.. ప్రజల దగ్గరికి మాత్రం చేరలేదు. దీంతో వైసీపీ నేతలకు సామాన్యులే సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. వాట్సప్ సేవలను జగన్ ఎప్పుడు ప్రారంభించారు.. దాని ద్వారా ఎవరైనా సేవలు వినియోగించుకున్నారా.. అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరికొంతమంది అయితే… వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు ఎదుటి వారిని తిట్టడం తప్ప… మీ ప్రభుత్వం గురించి ఏరోజైనా ఎవరికైనా మంచి గురించి చెప్పారా… అని నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ నేతల నోటీకి తాళం పడుతోంది.