కాదేదీ పబ్లిసిటీకి అనర్హం.. అనేది ప్రస్తుతం రాజకీయ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గురించి సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. ఏ నేత ఏం చేస్తున్నారు.. ఏ ప్రభుత్వం ఎలా పని చేస్తుంది.. ఏ పార్టీ నేతలు ఎంత సంపాదిస్తున్నారు.. నేతల గురించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో తెలిసిపోతోంది. గతంలో నేతలు నేరుగా దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం.. చివరికి ఫోన్‌లో బెదిరించడానికి కూడా భయపడుతున్నారు. ఇందుకు ఏకైక కారణం.. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. వాటిల్లో వాట్సప్, ఫేస్ బుక్, ఎక్స్, టెలిగ్రామ్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా అకౌంట్లు అందుబాటుల్లోకి వచ్చేశాయి. వీటి ద్వారా తమ ఊరి వార్తల కంటే కూడా.. జిల్లా, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి విషయాలు కూడా వెంటనే తెలిసిపోతున్నాయి. అందుకే ప్రతి ఒక్క రాజకీయ నేత కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read : ఎమ్మెల్యేలకు టైమ్ టేబుల్ ఫిక్స్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం కోసం ఆయన చేసే పనులు అందరికీ తెలుసు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్ర పేరుతో ఇంటింటికీ వెళ్లి పరామర్శించిన ఆర్థిక సాయం అందించారు. ఆ విషయాన్ని సొంత మీడియా సాక్షిలో బాగా ప్రచారం చేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ అధికారంలోకి రావాలంటే.. పాదయాత్ర చేయాలని భావించారు. అందుకే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏడాదిన్నర పాటు 3 వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర గురించి వైసీపీ నేతలతో పాటు సొంత మీడియా కూడా బాగా ప్రచారం చేసింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు కూడా బయటపెట్టలేదు. పూర్తిగా ప్యాలెస్‌కు పరిమితం అయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జగన్ పర్యటన పూర్తిగా పరదాలా చాటున సాగిందని సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి. దీంతో జగన్ ప్రజలకు దూరమయ్యారనే ప్రచారం బాగా జరిగింది.
ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తన మకాం తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్‌కు మార్చేశారు. ఇది ఆ పార్టీకి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. పార్టీ అధినేత అందుబాటులో లేడు అనే ప్రచారం ఆ పార్టీపై బాగా ప్రభావం చూపించింది. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ తీరుపైన రాష్ట్ర ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేష్.. ప్రతిరోజు 2 వేల మందితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ప్రతి ఒక్కరితో మమేకం అయ్యారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనలో ఎలాంటి మార్పు రాలేదనేలా వ్యవహరించారు. ఉండవల్లి క్యాంపు ఆఫీసు వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో తరచూ పర్యటించారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అలాగే తన కార్యాలయంలో ప్రత్యేక వింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు దాదాపు 5 వేల మంది వచ్చారు. పార్టీ ఆఫీసు బయట కూడా క్యూ కట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?
ఇదే సమయంలో కేవలం పార్టీ నేతలతో మాత్రమే జగన్ కలుస్తున్నారని.. కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోవటం లేదని.. అసలు జగన్‌ను కలవటం ద్వితీయ శ్రేణి నేతలకు కూడా అసాధ్యమనే మాట వైసీపీలో వినిపిస్తోంది. బెంగళూరు వస్తున్న జగన్.. పార్టీ ముఖ్యనేతలతో మాత్రమే మాట్లాడుతున్నారని.. యాత్రలు, పరామర్శలప్పుడు మాత్రమే కార్యకర్తలకు జగన్ దర్శనం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా టీమ్ రంగంలోకి దిగింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రతిరోజూ వేల మంది అభిమానులు, కార్యకర్తలు జగన్‌ను కలుస్తున్నారని.. జగన్ కోసం జనం బారులు తీరుతున్నారని వీడియో రిలీజ్ చేశారు. జగన్ కోసం తోపులాటలు అంటూ ప్రచారం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఎవరికైనా ప్రవేశం ఉందని.. ప్రజా సమస్యలు తీర్చడంలో జగన్ ముందు వరుసలో ఉంటారని కూడా వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం.. ఎన్నికల ముందు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. తనకు క్రేజ్ తగ్గలేదని.. లోకేష్ కంటే.. తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే రీతిలో జగన్ ప్రచారం చేసుకునేందుకే ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారనే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.

