వైసీపీ నేతలు, కార్యకర్తలే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను తప్పు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ సన్నిహితుల దగ్గర ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. 2019, 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ లో చాలా మార్పు వచ్చిందనేది వాస్తవం. 2019 ఎన్నికల తర్వాత జగన్ లో తెలియని అహంకారం వచ్చేసింది. 151 సీట్లు గెలిచిన గర్వంతో నేనే పార్టీ… పార్టీయే నేను అన్నట్లుగా జగన్ వ్యవహరించాడు. చివరికి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక జిల్లాల పర్యటనకు వస్తే కార్యకర్తను కలవడం మాట పక్కన పెడితే.. పరదాలు లేకుండా వచ్చిన సందర్భాలు లేవు. చివరికి విజయవాడ సిటీలో చిన్న ప్రారంభానికి వచ్చిన సరే.. బెంజ్ సర్కిల్లో పరదాలు కట్టిన పరిస్థితి. చివరికి ఎన్నికల్లో కూడా నన్ను చూసి ఓటు వేయండి అన్నట్లుగా జగన్ ప్రచారం కొనసాగింది.
Also Read : వైసీపీ ఎంపిలకు జగన్ సంచలన ఆదేశాలు..?
అయితే 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి గెలవడంతో అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి. పార్టీ ఓటమికి కేవలం జగన్ మాత్రమే కారణమని సగటు కార్యకర్త బహిరంగంగానే విమర్శించారు. దీంతో చేసిన తప్పు సరిదిద్దుకునేందుకు జగన్ ఇప్పుడు నానాపాట్లు పడుతున్నారనేది వాస్తవం. కార్యకర్తలను దూరం పెట్టాను.. అని తప్పు ఒప్పుకునేందుకు ధైర్యం చేయలేని జగన్… రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని… అందువల్ల కార్యకర్తను గుర్తించలేకపోయానంటూ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ విడిచి వెళ్ళిపోతున్న నేతలపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు జగన్. విలువలు, విశ్వసనీయత అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన నేతలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కొంతమంది సీనియర్ నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీ బలంగా ఉందని నమ్మించేందుకు జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read : గతం మర్చిపోయి నోరుజారిన కేసీఆర్
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతల్లో సగం మంది ఇప్పటికే జగన్ కు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. దీనివల్ల పార్టీ క్యాడర్లో అధినేతపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఇలాంటి పరిస్థితులలో జగన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు జగన్. ఇప్పటికే మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లం రాజు కూడా వైసీపీలో చేరుతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వీళ్లంతా ఇప్పుడు అవుట్ డేటెడ్ పొలిటిషన్స్. సీనియర్లు అయినప్పటికీ కొత్త వారి రాకతో ఈ ప్రాబల్యం తగ్గిందనేది వాస్తవం. అయితే ఇలాంటివారిని పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీ బలంగా ఉంది అనే మాటను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ ప్లాన్. మరి మీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.