ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభకు హాజరైన వైసీపీ సభ్యులు అంతా ఊహించినట్లే సభలో గందరగోళం చేసి బాయ్‌కాట్ చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. లేని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని గుర్తించాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంగా వైసీపీని గుర్తించి ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఓ వైపు తమ పార్టీ సభ్యులంతా ఆందోళన చేస్తుంటే… అధినేత జగన్ మాత్రం సీట్‌లోనే కూర్చున్నారు.
Also Read : ఏపిలో డయల్ యువర్ సీఎం.. ఎవరికి.. ఎందుకు?
ఇక గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని సభలో నినాదాలు చేశారు. 2019-24 మధ్య రాష్ట్రం పురోగతి పాలైందంటూ గవర్నర్ చేసిన ప్రసంగాన్ని వైసీపీ నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రీప్ట్‌ను గవర్నర్ చదివారని ఎద్దేవా చేశారు. సభ పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని… తమకు న్యాయం జరిగే అవకాశం లేదంటూ సభను వైసీపీ నేతలు బాయ్‌కాట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యంలో చట్టసభలకు అవకాశం లేదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన జరుగుతోందని విమర్శలు చేశారు. అక్రమ అరెస్టులతో తమ పార్టీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు.
Also Read : అసెంబ్లీకి జగన్.. అనర్హత భయంతోనేనా?
వైసీపీ నేతల ఆరోపణలకు కూటమి నేతలు ధీటుగా బదులిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిన విషయం జగన్ మర్చిపోయాడా అని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందనే భయంతోనే.. ఈ రోజు సభకు వచ్చారు తప్ప… ప్రజలపైన ఎలాంటి ప్రేమ లేదన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. ఐదేళ్ల పాటు ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన విషయం గుర్తులేదా అని విమర్శించారు. గతంలో సీఎం అసెంబ్లీకి రావాలంటే పరదాలు కావాలని… కానీ ప్రస్తుత సీఎంకు అలాంటి అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో కూడా వైసీపీ నేతలకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని నిలదీశారు. 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టే… సరిగ్గా 11 నిమిషాలు మాత్రమే సభకు హాజరయ్యారని ఎద్దేవా చేశారు.