యువగళం పాదయాత్రలో చేతిలో రెడ్ బుక్ చూపించిన మంత్రి నారా లోకేష్… ప్రభుత్వంతో అంటకాగి… టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులు, నేతల పేర్లు రాసుకుంటున్నట్లు చెప్పారు. అలాంటి వారంతా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చారు. చెప్పినట్లుగానే ఇప్పటికే నాటి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తించిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే వారు చేసిన అక్రమాలను బయటకు తీయడంతో పాటు వారిపై చర్యల కూడా చేపట్టారు.
ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. ఆ నేతలు చేసిన అవినీతిని బయటకు తీశారు. దీంతో రెడ్ బుక్ పాలన జరుగుతోందని.. ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారు. అయితే దీనికి ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ తీసుకురావడం ఎంతో సులభమన్నారు జగన్. రెడ్ బుక్ ఏమైనా పెద్ద విషయమా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెర లేపిందని… మేమైతే గుడ్ బుక్ రాస్తున్నామంటూ మంగళగిరి నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి వివరాలను గుడ్ బుక్‌లో రాస్తున్నామని… వారికి తప్పకుండా మంచి అవకాశాలు, ప్రమోషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయని… కష్టాల నుంచే నాయకులు పుడతారన్నారు. చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుతురు వస్తుందన్నారు.
Also Read : నేడే ఏపీ కేబినేట్ భేటీ… అన్నీ సంచలనాలే
అయితే జగన్ చెప్పిన గుడ్ బుక్ గురించి ఇప్పుడు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే టార్గెట్ జగన్ అని, జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అధికారంలో ఉన్న సమయంలో నేతలు, కార్యకర్తలను ఏ రోజు పట్టించుకోలేదు కదా… చివరికి మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదు జగన్ అని ప్రశ్నిస్తున్నారు. ఓడిన తర్వాత తత్వం బోధపడిందా జగన్ అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
పదేళ్లు కష్టపడిన కార్యకర్తకు ఐదేళ్ల పాలనలో జరిగిన మంచి ఏమిటో చెప్పాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. సొంత సంస్థల్లో పని చేసిన ఉద్యోగులకు మేలు చేశారు తప్ప… పార్టీ కోసం ఖర్చు చేసిన వారికి, ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మునిసిపల్ ఛైర్మన్లకు కనీసం బిల్లులు కూడా క్లియర్ చేయలేదు కదా అని నిలదీస్తున్నారు. ఇక కార్పొరేషన్ పదవులు ఇచ్చామని గొప్పగా చెప్పుకున్న జగన్… వారికి కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సొంత వారే బాగుపడ్డారు తప్ప… పార్టీ కార్యకర్తలకు ఎలాంటి మేలు చేశావో చెప్పగలవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గుడ్ బుక్ ప్రకటన ఆదిలోనే హంసపాదులా మారిపోయింది.