కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాటకు పిలుపునిచ్చింది. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు చేరుకున్నాయి. ఈ ఆందోళనకు పోరుబాట అనే పేరు కూడా పెట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారని… అలాగే అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తామంటూ బూటకపు హామీలు కూడా చంద్రబాబు ఇచ్చారంటూ విమర్శించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే విద్యుత్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టారని ఇప్పుడు మండిపడుతున్నారు వైసీపీ నేతలు. వినియోగదారులే విద్యుత్ అమ్మేలా చేస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని… కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యుత్ వినియోగదారుల తరఫున నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైసీపీ చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు.
Also Read : టార్గెట్ మహిళా ఎమ్మెల్యే.. కార్పోరేటర్లకు జగన్ ఆదేశాలు
వైసీపీ పోరుబాటకు ఏపీ అధికార కూటమి నేతలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అసలు పోరుబాట ఎందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014-2019 మధ్య ఐదేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్… ఐదేళ్ల కాలంలో ఏకంగా 9 సార్లు ఛార్జీలు పెంచిన విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. విద్యుత్ సర్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో వినియోగదారులపై మోయలేని భారం మోపిన ఘనత జగన్ సర్కార్‌కే దక్కుతుందంటున్నారు. అదానీ నుంచి భారీగా లంచం తీసుకున్న జగన్… చీకటి ఒప్పందం చేసుకుని ఏపీ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని విమర్శిస్తున్నారు.
Also Read : నేను తగ్గను.. బెనిఫిట్ షోస్ ఉండవు: రేవంత్ క్లారిటీ
కూటమి ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచినట్లు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదే విషయంపై దమ్ముంటే అసెంబ్లీకి వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు కదా అని సవాల్ చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం అని విజయసాయిరెడ్డి వంటి నేతలు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని… అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే.. ఛార్జీలు ఎవరి హయాంలో పెరిగాయో తేలిపోతుందన్నారు. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

