విజయవాడలో వరదల స్థాయి ఏ విధంగా ఉందో అందరికి తెలిసిందే. వరదలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. వరద తగ్గితే తప్ప ఫలితం ఉందని పరిస్థితి నెలకొంది. గత రాత్రి నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో నీరు నిదానంగా క్లియర్ అవుతోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు కృష్ణా నది పొంగి పొర్లడంతో ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. నాలుగు రోజులు అయినా కూడా బుడమేరు వరద తగ్గకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో అధికారులు కూడా ఉన్నారు. అయినా సరే సహాయక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలకు సహకరిస్తోంది.
ఇదిలా ఉంచితే సహాయక కార్యక్రమాల్లో విజయవాడకు చెందిన వైసీపీ నేతలు గాని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతలు గాని ఎవరూ కనపడలేదు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… జగన్ వచ్చిన సమయంలో బయటకు వచ్చారు. అలాగే దేవినేని అవినాష్ కూడా సహాయక చర్యల్లో పాల్గొనలేదు. తూర్పు నియోజకవర్గంలో వరద వచ్చినా అవినాష్ బయటకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మాజీ మంత్రి జోగి రమేష్ గొల్లపూడిలో ఉన్నా సరే వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం మాత్రం చేయలేదు.
వైసీపీకి చెందిన కౌన్సిలర్లు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హీరోలం అని చెప్పుకునే మాజీ మంత్రులు పెర్ని నానీ, కొడాలి నానీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఎక్కడా బయట కనపడలేదు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సైతం దూరంగానే ఉన్నారు. తన పార్టీ నేతలకు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనే ఆదేశాలు కూడా జగన్ నుంచి రాలేదు. అటు వైసీపీ కార్యకర్తలు సైతం సేవా కార్యక్రమాలకు దూరంగానే ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. వైసీపీ నేతలు ఎవరూ కూడా విరాళాలు ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు.