ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల్లో ఇప్పుడున్న భయాలు ఆ పార్టీని ఏ దిశగా నడుపుతాయో అనే ఆందోళన మొదలయింది కార్యకర్తల్లో. అవును.. రోజురోజుకి ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. వైఎస్ కుటుంబంలో ఈ రేంజ్ లో చీలిక వస్తుందని కార్యకర్తలు గాని, నాయకులు గాని అసలు ఊహించలేదు. షర్మిల వరకే పోరాటం అని భావించినా విజయమ్మ విడుదల చేసిన లేఖతో పరిణామాలు ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉందో పార్టీ నేతలకు అసలు అంతుబట్టని పరిస్థితి నెలకొంది.
ఆస్తి పంపకాల విషయంలో షర్మిల… జగన్ తో ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమె విడుదల చేసిన ఓ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. తన బిడ్డలపై ప్రమాణం చేస్తా అని, జగన్, వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేసారు. ఆ లేఖ ఇంకా మీడియాలో ఉండగానే విజయమ్మ మరో లేఖను విడుదల చేసారు. దీనితో జగన్ ను ఇప్పుడు ప్రజలు కూడా దోషిగా చూసే పరిస్థితి నెలకొంది. ఇక ఈ విషయంలో కార్యకర్తలు కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
Also Read : జగన్ పాపాలన్నీ బయటపెట్టిన తల్లి విజయమ్మ
వైసీపీ నేతల్లో అయితే ఆందోళన స్పష్టంగా కనపడుతోంది. టీడీపీని ఏదోక రూపంలో ఎదుర్కోవచ్చని షర్మిల విషయంలో జగన్ ఆస్తి పంచడం మినహా మార్గం లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేయడం కూడా జగన్ కు కష్టంగానే ఉండవచ్చు. పార్టీ నేతలు ఎంత వరకు ఆయన మాట వింటారు అనేది కూడా చెప్పడం కష్టమే. రాజకీయ భవిష్యత్తు కోరుకునే నేతలు త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉండవచ్చు అని తెలుస్తోంది. ఓ వైపు కూటమిని ఎదుర్కోవడం మరో వైపు షర్మిలను ఎదుర్కోవడం జగన్ కు కత్తి మీద సాములాంటిదే. మరి త్వరలో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో చూడాలి.




