ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది. వైసీపీకి ఇప్పటికే కొంతమంది కీలక నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు జగన్ కు అండగా నిలబడే నేతలు కొంతమంది ఇప్పటికే రాజీనామాలు చేసి కోలుకోలేని దెబ్బ కొట్టారు. త్వరలోనే మరో కీలక నేత కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే సదరు నేత జనసేన పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
Also Read : వైసీపీలో సాయిరెడ్డి రీప్లేస్‌మెంట్..!
ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలో భవిష్యత్తు కనపడకపోవడం పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా చేజారిపోవడంతో ఇప్పుడు కోటగిరి శ్రీధర్ కూడా తన దారి తను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన కోటగిరి శ్రీధర్ ఆ తర్వాత సమర్థవంతంగానే పనిచేశారు. ఆర్థికంగా కూడా ఏలూరు జిల్లాలో ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించారు కోటగిరి శ్రీధర్.
Also Read : వైసీపీ ఫీజు పోరు.. మళ్లీ వాయిదా తప్పదా..!
అయితే గత కొన్ని రోజులుగా వైసిపి భవిష్యత్తు కనపడకపోవడం అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న కొంతమంది నేతలు కూడా పార్టీ జండా మోయడానికి ఇష్టపడకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారెందుకు సిద్ధమవుతున్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు ఉన్న విభేదాలు కూడా పార్టీ మార్పుకు కారణమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వద్ద పలుమార్లు ఎలీషా గురించి శ్రీధర్ ఫిర్యాదులు చేసిన లాభం లేకపోవడంతో ఇక తాను పార్టీ నుంచి బయటకు రావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులు అలాగే స్థానిక నాయకత్వానికి కూడా కోటగిరి శ్రీధర్ సమాచారం పంపించారు.