నా మతం మానవత్వం అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వాన్ని మంట కలిపారు. తనదైన యాత్రా స్పెషల్‌లో జగన్‌కు ఒక ఇబ్బంది ఎదురైంది. తన కారు చక్రాల కింద నలిగిపోతున్న వ్యక్తిని గమనించిన వ్యక్తులు కారు ఆపమంటూ గట్టిగా అరచినప్పటికీ డ్రైవర్ కారు ఆపలేదు. జగన్ కార్ ముందుకు వెళ్లిపోయాక చక్రాల కింద పడిన వ్యక్తిని ప్రక్కకు ఈడ్చేసింది ఎవరు.. 108కు ఎవరు ఫోన్ చేశారో తెలియదు కానీ కనీసం ఎవరో ఒకరు కనికరం చూపారు. కారు క్రింద ఒక వ్యక్తి నలిగిపోతున్నాడు అని జగన్ మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు. డ్రైవర్ గమనించకపోవటం ఆశ్చర్యం.
Also Read : మాట నెగ్గించుకున్న అమ్రాపాలి
యాత్ర మొదలైంది ఒక అసంబద్ధ విషయానికి. బెట్టింగుల కోసం అప్పులు చేసి అప్పుల వాళ్లు తమ డబ్బులు ఇమ్మని ఒత్తిడి చేయగానే ఆత్మహత్య చేసుకుని వైసీపీ కార్యకర్త మరణించాడు. బెట్టింగు కాసింది వైసీపీ గెలుస్తుందని.. కానీ వైసీపీ ఓడిపోయింది. జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరక ముందే ఎనిమిదవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన రోజు పరామర్శకు జగన్ వెళ్ళలేదు. సంవత్సరం గడిచిన తర్వాత జగన్‌కు అకస్మాత్తుగా బెట్టింగుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాలనే ఆలోచన వచ్చింది. భారీ కాన్వాయితో జగన్ బయలుదేరారు. ప్రమాదం జరిగింది. వైసీపీ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి స్పందన ఎలా వుంది అనేది తరువాత విషయం. జరిగిన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : విమర్శల దెబ్బకు వెనక్కు తగ్గిన గంభీర్.. టీంలో భారీ మార్పులు
సంవత్సర కాలంగా జగన్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన ప్రతి సారి జనసమీకరణ చేస్తున్నారు. అది బలప్రదర్శన నిమిత్తం చేస్తున్నారా లేక నిజంగా జనమే అలా వస్తున్నారా అనేది ఆ పార్టీ నేతలే చెప్పాలి. కారణాలు ఏమైనా జనం గుమికూడటం అయితే జరుగుతుంది అనంతపురం వెళ్లినప్పుడు కూడా జనాన్ని కట్టడి చెయ్యటం కష్టమైంది. గుంటూరు మిర్చి యార్డు దగ్గర కూడా సేమ్ సీన్. జగన్ తన యాత్రని అలాగే చేస్తారు. జనాన్ని రెచ్చగొడతారు. పార్టీ అభిమానంతో వచ్చే జనం అటువంటి అల్లర్లు చేయటం జరగదు. తెలుగుదేశం పార్టీ మీటింగులకు వచ్చినంత మంది జనం ఎవరికి రారు. చంద్రబాబు పార్టీ నిర్మాణంలో మొదటి నుండి వామపక్షాలను అనుకరించినట్లు అనిపిస్తుంది. వామపక్షాల్లో ఉండే క్రమశిక్షణ కొంతమేర టీడీపీలో కనిపిస్తుంది. మీటింగులకు లక్షల మంది వచ్చినా సుశిక్షితమైన సైనికుల్లానే వస్తారు, వెళ్తారు. కానీ వైసీపీ బహిరంగసభల్లోనే కాదు, చిన్న సమావేశాల్లోనైనా ఏదో ఒక రచ్చ జరుగుతుంది.
Also Read : జీర్ణ సమస్యలు ఉన్నాయా..? ఈ 5 తింటే చాలు
సాధారణంగా జగన్ భారీ బహిరంగ సభలు పెట్టరు. అధికారంలో ఉన్నప్పుడు సభలు, సమావేశాలు ఎప్పుడూ పెట్టలేదు. రాజకీయ అజెండా ఉంటేనే ప్రజల దగ్గరకు వస్తారు. పథక రచనలోనే అరాచకం ఉంటుందని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే వాళ్ళు ఎక్కువగా యువత. ఓటర్ కాని వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు. ఇంకా చెప్పాలంటే కార్యకర్తలు మాత్రమే కాక అభిమానులు వస్తారు. కానీ ఎటువంటి అరాచకాలు జరగవు. పవన్ కళ్యాణ్ కనిపించగానే కేరింతలు కొట్టే టీన్స్. అయినా రచ్చ ఉండదు. అంటే జగన్ సమావేశాల్లో పథకం ప్రకారమే అల్లర్లు జరుగుతాయి. ఇదేమీ కొత్తగా ఈరోజు కనిపెట్టింది మాత్రం కాదు. కానీ కూటమి ప్రభుత్వం జగన్ యాత్రలను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరగకపోయినా పట్టించుకోవటం లేదు. జనం గుమ్మికూడేలా వారి పథక రచన ఉంటుందని తెలిసీ పభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం కనిపిస్తుంది.
Also Read : కన్నప్పకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
మొన్నటికి మొన్న రెంటపాళ్ల యాత్రకు పోలీసులు నిర్దిష్టమైన నిబంధనలు ఖరారు చేశారు. యాత్ర మొదలైనప్పుడే నిబంధనల ఉల్లంఘన కూడా మొదలైంది. స్టార్టింగ్ పాయింట్ దగ్గరే బయల్దేరిన కార్లను అడ్డుకొనే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిబంధనలు విధించిన వారికి అవి అమలు అయ్యేలా చూడవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అమలు కానప్పుడు బాధ్యతగా అమలు చేసేలా చూడటం, అవసరమైతే తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు చేపట్టలేదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. సింగయ్య అనే వ్యక్తి జగన్ వాహనం టైర్ల క్రింద నలిగిన కేసులో పోలీసు అంత హడావుడిగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒక ఎస్పీ స్థాయి అధికారి సింగయ్య అనే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడలేదు.. సింగయ్యను వేరే కారు ఢీ కొట్టింది.. అంటూ ఒక కారు నంబర్ కూడా చెప్పటం ప్రభుత్వ అలసత్వానికి మచ్చుతునక.
Also Read : కేసులంటే అంత భయం ఎందుకో..!
జనం గుంపుగా కూడకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు. తరువాత పెట్టిన కేసులో డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది. జగన్ అలా యాత్ర చెయ్యకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ రోడ్ షో చేసి గుంపుని పోగు చేశారు. కాబట్టి జగన్‌ని కేసులో పెట్టటం వరకూ సక్రమమే అనిపిస్తోంది. కానీ కారులో కూర్చున్న వేరే వారి పైన ఎందుకు కేసు పెట్టారో తెలియదు. అందువల్ల ఈ కేసు పలుచబడింది అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. వారిని ప్రయాణీకులుగా మాత్రమే కోర్టు పరిగణించే అవకాశం ఉందంటున్నారు. చంద్రబాబు ఇంటినుండి బయటకు రాకుండా గేటుకు తాళ్లు కట్టి ఆపిన యంత్రాంగం ఇప్పుడు ఏమైందో తెలియటం లేదు. విశాఖపట్టణం వెళ్లిన చంద్రబాబును వెనక్కి పంపించటం ప్రజలు చూశారు. పవన్ కళ్యాణ్‌ను జగ్గయ్యపేట దగ్గర ఆపగలిగిన వ్యవస్థలు ఇప్పుడు అలసత్వంతో ఉంటున్నాయి.
Also Read : వాటి సంగతి ఏం చేశారు సార్..?
యువగళం యాత్ర సమయంలో పెట్టిన ఆంక్షలను లోకేష్ ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అప్పుడు ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదు. అయినా చాలా పట్టుదలగా ఉన్న యంత్రాంగం ఇప్పుడు అవసరమైనా స్పందించకపోవటం ప్రభుత్వ వైఫల్యంగానే భావించాలి. జగన్ మోహన్ రెడ్డిపైన కేసు పెట్టటం గురించి వైసీపీ శ్రేణులు పెద్దగా స్పందించకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. జగన్ రెంటపాళ్ల యాత్ర మాత్రం షాక్ ఇచ్చిందనే అనిపిస్తుంది. సాక్షి ఛానల్ తప్ప ప్రజల్లో స్పందన కనిపించటం లేదు. సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించటం పేరుతో రాజకీయ అజెండాతో యాత్ర చేసి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమయ్యారు. తన కారు కింద పడిన సింగయ్య విషయం తెలిసిన తరువాత అయినా ఆ కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లలేదు. మళ్లీ అదొక యాత్ర జరిగే అవకాశం ఉంది. అప్పటికైనా ప్రభుత్వం తన అలసత్వాన్ని వదిలిపెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య చేసే జగన్ మోహన్ రెడ్డి యాత్రలకు నిబంధనలను విధించటమే కాక వాటిని అనుసరించేలా చెయ్యాలి.