విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నానీ మళ్ళీ రాజకీయాల్లోకి రానున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. రాజకీయంగా ఒకప్పుడు కేసినేని నానీ వేసిన అడుగులు ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసినేని నానీ మనసు మార్చుకుని తిరిగి రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఎంపీగా ఆయన పని తీరుకి ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి అప్పట్లో. కొన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు అన్ని పార్టీల్లో మంచి స్నేహితులు ఉన్నారు. ఇదే క్రమంలో పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో కూడా నానీకి మంచి ఇమేజ్ వచ్చింది. అయితే అనూహ్యంగా వైసీపీలో జాయిన్ కావడం ఆయనను దెబ్బ కొట్టింది. ఇక ఇదే అదునుగా చేసుకున్న ఆయన సోదరుడు కేశినేని చిన్ని… టీడీపీలో టిక్కెట్టు పై ఎంపీ కూడా అయ్యారు. నానీ టీడీపీలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఎంపీ అయ్యే వారు అనే అభిప్రాయం ఉంది. ఇక వైసీపీ ఓటమి తర్వాత నానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
Also Read :జగన్ కు మరో ముగ్గురు ఎమ్మెల్సీల షాక్
వ్యాపార వ్యవహారాలతోనే ఆయన బిజీగా ఉన్నారట. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నాని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన త్వరలోనే తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ కావాలని చూస్తున్నారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో నానీ భేటీ అయ్యే అవకాశం కనపడుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడే ఆలోచనలో ఉన్న నేపధ్యంలో పలువురు నేతలకు స్వాగతం పలుకుతోంది. ఈ నేపధ్యంలోనే నానీకి కూడా స్వాగతం పలుకుతున్నట్టు సమాచారం. సంక్రాంతి లోపే ఆయన జాయిన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి.