కొలికపూడి విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారా.. అంటే.. అవుననే మాట ఇప్పుడు సొంత పార్టీలోనే వినిపిస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం తొలి నుంచి పార్టీకి తలనొప్పిగానే ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక వివాదంలో కొలికపూడి పేరు వినిపిస్తూనే ఉంది. తనకు ఏ మాత్రం పరిచయం లేని నియోజకవర్గం నుంచి గెలిచిన కొలికపూడి.. తొలి రోజు నుంచే పెత్తనం చెలాయిస్తున్నారనేది స్థానిక నేతల మాట. గ్రూపు రాజకీయాలకు తెర లేపిన కొలికపూడి.. ఇసుక, రేషన్ మాఫియాతో చేతులు కలిపి.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తొలి నుంచి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నిలదీసిన స్థానిక టీడీపీ నేతలకు గ్రూపులు అంటగడుతున్నారు. ఏమైనా అంటే.. కులం ప్రస్తావన చేస్తూ.. తన పబ్బం గడుపుకుంటున్నారు. తాను మాత్రమే తిరువూరులో అభివృద్ధి చేశానని.. అంతకు ముందు అసలు తిరువూరు అంటే ఎవరికీ తెలియదని గొప్పలు కూడా చెప్పుకున్నారు.
Also Read : రచ్చ చేసేందుకు సీనియర్ రెడీ..!
అమరావతి ఉద్యమం అంటూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొలికపూడి.. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. టీవీ డిబేట్లలో పదే పదే కనిపించిన కొలికపూడి టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. అమరావతి కోసమంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేశారు. దీంతో కొలికపూడిని నమ్మేసిన చంద్రబాబు.. తిరువూరు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. ఇలా టికెట్ వచ్చిందో లేదో.. నియోజకవర్గం సీనియర్ నేతలతో పాటు, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పైన పొగడ్తల వర్షం కురిపించారు. మీరు లేకపోతే నేను గెలవలేను.. మీరే నా మార్గదర్శులు అంటూ ఎన్నికల్లో అందరి ఫోటోలతో ప్రచారం చేశారు. అటు పార్టీ నేతలు కూడా టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. గెలిచిన తర్వాత కొలికపూడి తీరు మారిపోయింది. తన వల్లే తిరువూరులో టీడీపీ జెండా ఎగిరిందని గొప్పలు చెప్పుకున్నారు. నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే పదవులివ్వాలని.. అధిష్ఠానానికి హుకుం జారీ చేశారు.
Also Read : జోగి.. కేరాఫ్ కులం కార్డు..!
ఇక తన అరాచకాలు ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అంటూ పట్టుబడ్డిన కొలికపూడి.. వారిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ బెదిరించారు కూడా. అయితే కొలికపూడి విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు.. రెండు సార్లు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రెండుసార్లు పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరైనా కొలికపూడి.. ఇక నుంచి బుద్ధిగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. అయితే కొలికపూడి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ మళ్లీ అదే బుద్ధి చూపించారు. ఈసారి ఎంపీ కేశినేని చిన్ని పైనే అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. స్వయంగా రంగంలోకి దిగిన పార్టీ అధినేత చంద్రబాబు.. ఇద్దరు నేతలతో తానే స్వయంగా మాట్లాడుతా అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మళ్లీ అదే క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి బాధ్యతను అప్పగించారు. కొలికపూడికి మూడోసారి క్రమశిక్షణ సంఘం నోటీసులు పంపింది. అయితే ఇక్కడే పార్టీలో ఒక చర్చ నడుస్తోంది.
కొలికపూడిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీని కాపాడుకునేందుకు ఓ ఎస్సీపైన చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తాయని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు లైట్ తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియకే చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నారని.. అందుకే క్రమశిక్షణ సంఘాం ద్వారా మీకిదే లాస్ట్ వార్నింగ్ అనే మాట చెప్పి.. బయటకు పంపిస్తారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదే జరిగితే.. మరి కొలికపూడి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.

