తెలంగాణ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. కవిత కొన్నాళ్ల క్రితం రాసిన ఓ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. లేఖలో కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గులాబీ పార్టీల విభేదాలు అనడం కంటే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు అనేది ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది. ఆ పార్టీతో పాటుగా రాజకీయ వర్గాల్లో దీని గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Also Read : నటుడు.. నాయకుడు.. అన్న ఎన్టీఆర్..!
అధికారంలో ఉన్నప్పుడు కలిసి ఉన్న కుటుంబం .. అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగా మారడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఆ పార్టీలో విభేదాలు ఏవి ఉన్నా సరే కేసీఆర్ వద్దనే పరిష్కారం అవుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి పై పోరాటం చేయాల్సిన సమయంలో ఇలా కుటుంబంలో విభేదాలు రావడం పార్టీ నాయకులను కూడా ఇబ్బంది పెడుతోంది. కవిత రాసిన లేఖ సంగతి పక్కన పెడితే శుక్రవారం సాయంత్రం ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత కలవరం రేపాయి. కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని.. ఆయన దేవుడు లాంటి వ్యక్తి అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : భయం భయంగా బెజవాడ.. మళ్ళీ ఎందుకీ అలజడి..?
దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ పైనే ఆమె అసహనంగా ఉన్నట్లు అర్థమవుతుంది. అలాగే ఆ పార్టీ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కూడా ఆమె అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కల్వకుంట్ల కుటుంబంలో.. విభేదాలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కారణమనే వార్తలు వినపడుతున్నాయి. ఆయన ఆధిపత్యం నచ్చకే కవిత అసహనంగా ఉన్నారనేది చాలామంది మాట. లిక్కర్ కుంభకోణం సమయంలో కవితకు పార్టీ నేతలు కొంతమంది అండగా నిలబడకపోవడం వెనక పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్ర ఉందనేది కవిత అనుమానం గా గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే నిజామాబాద్ ఎంపీగా తాను ఓడిపోవడం వెనుక కూడా ఆయన పాత్ర ఉందనేది కవిత అనుమానం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేకనే.. కవిత బహిరంగ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గడాన్ని కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.




