ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత దారుణ ఉగ్రవాద దాడిగా చెప్తున్న , పహల్గామ్ లో జరిగిన దాడిపై ఇప్పుడు దర్యాప్తు బృందాలు వేగం పెంచాయి. ఈ దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ మారణహోమానికి బాధ్యత వహించింది. పహల్గామ్ దాడికి లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన సైఫుల్లా కసూరి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇక ఫ్రంట్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించాడని నిఘా వర్గాలు భావిస్తున్నారు.
Also Read : సాయి రెడ్డే కీలకమా..? కసిరెడ్డి రిమాండ్ లో సంచలనాలు..!
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ను ఆగస్టు 5, 2019 న రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ను కేంద్రంలో పూర్తిగా విలీనం చేసేందుకు.. కేంద్రం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. ఆ తరువాత ఉగ్రవాద కార్యకలాపాలు, రాళ్ళు రువ్వే సంఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న.. ఉగ్రవాదులు దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : టూరిస్ట్ లను ఎందుకు టార్గెట్ చేసినట్టు..? దాడి లక్ష్యం అదేనా..?
ఎల్‌ఇటి, జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), దాని ఉగ్రవాద అధినేతలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో.. పాకిస్తాన్ ఉగ్రవాదులు సహా నలుగురు-ఐదుగురు ఉగ్రవాదుల బృందం పాల్గొన్నట్టు తెలుస్తోంది. పర్యాటకులపై దాడికి కొన్ని రోజుల ముందు వారు లోయలోకి చొరబడ్డారని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ దాడిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అమరనాథ్ యాత్రికులను భయపెట్టేందుకే ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.