అసలు వాళ్లంతా ఏమయ్యారు.. ఎక్కడున్నారు.. ఇవే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలంతా ఏమయ్యారు అనేదే ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. అవును ఏ విషయంపైన అయినా సరే.. కేవలం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, హోమ్ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు తప్ప.. మిగిలిన నేతల్లో కనీసం ఒక్కళ్లు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు ఎంతో హడావుడి చేసిన నేతలంతా.. పదవులు వచ్చిన తర్వాత కనీసం కనిపించటం లేదు. చివరికి అది మహిళలకు సంబంధించిన విషయమైన సరే.. పార్టీకి చెందిన మహిళా నేతలు ఎవరూ స్పందించటం లేదు. మగవాళ్లు మాత్రమే దీనిపై మాట్లాడుతున్నారు. దీంతో అసలు టీడీపీ మహిళా నేతలు ఏమయ్యారు అనేదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్.
Also Read : పంత్ ఆడాలా..? వద్దా..? గిల్ ముందు పెద్ద సమస్యే..!
తెలుగుదేశం పార్టీకి మహిళా ఓటు బ్యాంక్ కీలకం. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మహిళలకు ఎంతో మేలు చేశారు. ఆస్తిలో సమాన హక్కు సహా ఎన్నో కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇక చంద్రబాబు కూడా డ్వాక్రా సంఘాలను ప్రొత్సహించడం ద్వారా మహిళలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చారు. టీడీపీ వల్లే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. నన్నపనేని రాజకుమారి, కావలి ప్రతిభా భారతి, మంత్రి సవిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, పీతల సుజాత, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, గద్దె అనురాధ, తోట సీతారామలక్ష్మి, పంచుమర్తి అనురాథ, తంగిరాల సౌమ్య, భూమా అఖిలప్రియ, రెడ్డివారి మాధవి రెడ్డి, బైరెడ్డి శబరి, గౌరు చరితారెడ్డి, గొట్టిపాటి లక్ష్మి, గుండ లక్ష్మీదేవి, సుగుణమ్మ, ఉండవల్లి శ్రీదేవి, పొడపాటి తేజస్విని, మిరియాల శిరీష వంటి నేతలంతా ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు. వీళ్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఉన్నారు. ఇక తెలుగు మహిళా విభాగం ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అంటూ గొప్పగా చెప్పుకునే వాళ్లు కూడా ఉన్నారు. మూల్పూరి కళ్యాణి, ఆషా, అన్నాబత్తుని జయలక్ష్మి, కొణతాల రత్నకుమారి వంటి నేతలు ఇప్పుడు పదవుల కోసం పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
Also Read : పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు
అయితే ఈ మహిళా నేతలంతా ఇప్పుడు ఏమయ్యారు అనేదే హాట్ టాపిక్. ఇందుకు ప్రధానంగా తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదాహరిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయంపై సీరియస్ అయ్యారు. అయితే.. ఈ ఘటన తర్వాత కనీసం ఒక్కళ్లంటే ఒక్కళ్లు కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పలేదు. అసలు కొంతమంది నేతలైతే ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎమ్మెల్సీలు గ్రీష్మ, అనురాధ, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, మిరియాల శిరీష, భూమా అఖిలప్రియతో పాటు గుండ లక్ష్మిదేవి, తోట సీతారామలక్ష్మి, కావలి ప్రతిభాభారతి, పొడపాటి తేజస్విని కనీసం ఈ విషయంపై స్పందించలేదు. దీనిపై హోమ్ మంత్రి హోదాలో అనిత మాత్రమే ప్రెస్ ముందుకు వచ్చారు తప్ప.. మిగిలిన నేతల్లో కనీసం ఒక్కరు కూడా బయటకు రాలేదు.
Also Read : బెయిల్ ఇవ్వని సుప్రీం కోర్ట్.. అరెస్ట్ వద్దన్న ఏసీబీ కోర్ట్..!
పదవి వచ్చే వరకు మీడియా ముందు హడావుడి చేశారు తప్ప.. వచ్చిన తర్వాత నుంచి కనీసం ఏమయ్యారో కూడా తెలియదు. అమరావతి మహిళలపై సాక్షి టీవీలో డిబేట్‌లో అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. సాక్షి పత్రికా కార్యాలయాల ముందు కాసేపు హడావుడి చేశారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కార్పొరేషన్ పదవులు దక్కించుకున్న వాళ్లు, మార్కెట్ కమిటీ పదవులు పొందిన నేతలు కూడా ప్రశాంతి రెడ్డి విషయంలో కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అధికారంలోకి వచ్చాం.. ఇంకేం పనుంది అని అనుకున్నారో ఏమో అనే మాట ఇప్పుడు పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఓ వైపు వైసీపీలో మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, శ్యామలా సహా పలువురు మహిళా నేతలు ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి కూడా టీడీపీ మహిళా నేతలు కనీసం కౌంటర్ ఇవ్వటం లేదు. మహానాడు సమయంలో తప్ప మాధవీ రెడ్డి సైతం సైలెంట్ అయ్యారనే మాట వినిపిస్తోంది. దీంతో పార్టీ వాయిస్ వినిపించే మహిళా నేతలంతా ఏమయ్యారు… పదవులు వచ్చిన తర్వాత అంతా ఎక్కడున్నారు.. అనే మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది.