ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీలో పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న మూలపాడు పోర్టుకు తొలి కార్గొ షిప్ వస్తుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న భోగాపురం గ్రీన్ ఫిల్డ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయనే చెప్పాలి.
Also Read : నేపాల్ ఉద్యమం.. నష్టం ఎవరికీ..?
2015లో భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని భావించారు. ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. 2019లో ఫిబ్రవరి 14న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. మొత్తం 5,311 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని భావించారు. భోగాపురంలో MRO.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్.. తో పాటు ఏవియేషన్ అకాడమీ, కార్గో టెర్మినల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2018 ఆగస్టు నెలలో పీపీపీ విధానంలో జీఎంఆర్ సంస్థకు పనులు అప్పగించింది నాటి ప్రభుత్వం.
అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. విమానాశ్రయ నిర్మాణానికి కేవలం 2,200 ఎకరాలు చాలు అని ప్రకటించింది. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆయితే 2023లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కానీ భూమి కేటాయింపులపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. పనులు ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదు.
Also Read : సజ్జల ప్రకటనతో వైసీపీలో గందరగోళం..!
గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టులో ఊపందుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పనులు పురోగతిని స్వయంగా పర్యవేక్షించిన రామ్మోహన్ నాయుడు.. పూర్తి కావాల్సిన పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల్లో కూడా పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇప్పటికే 86 శాతం పనులు పూర్తైనట్లు మంత్రి వెల్లడించారు. విమానాశ్రయానికి మొత్తం 7 మార్గాల ద్వారా కనెక్టివిటీ గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విశాఖ – భోగాపురం ఎయిర్ పోర్టు రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.