రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఫ్యూచర్ ప్లాన్ ఏమిటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆకస్మికంగా రాజకీయ సన్యాసం ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. ఇక భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడేది లేదని… ఇకపై కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకుంటానంటూ విజయసాయిరెడ్డి భవిష్యత్ ప్రణాళిక కూడా చెప్పేశారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న సాయిరెడ్డి… దాదాపు 14 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న సాయిరెడ్డి.. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ వెంట నడిచారు.
Also Read: బాలయ్యకు పద్మ పురస్కారం అవసరమా..?
వైసీపీ ప్రారంభం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించారు. అటు జగన్ వ్యాపార లావాదేవీలు చూస్తూనే… ఇటు పార్టీ వ్యవహారాలు కూడా నడిపించారు. దీంతో సాయిరెడ్డిని రెండుసార్లు ఎంపీ చేశారు జగన్. అయితే వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అక్రమాలు చేశారు. జగన్ చేసిన ప్రతి అవినీతి వెనుక సాయిరెడ్డి పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. చివరికి కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావును బెదిరించి షేర్లు లాక్కున్న కేసులో సాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు కూడా. ఇప్పటికే ఉన్న కేసులకు తోడు… కొత్తగా మరిన్ని కేసులు కూడా మెడకు చుట్టుకుంటాయనే భయంతో సాయిరెడ్డి ముందుగానే అస్త్ర సన్యాసం చేసేశారు.
Also Read: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. కీలక సాక్ష్యాలు లభ్యం..!
రాజకీయాల గురించి మాట్లాడేది లేదని.. కేవీ రావు ఎవరో తెలియదని.. అసలు తాను అబద్ధాలే చెప్పలేదన్నారు కూడా. భవిష్యత్తు కూడా వ్యవసాయం అన్నారు. అయితే ఇదంతా పైకి చెబుతున్న మాటలే. తెర వెనుక మాత్రం సాయిరెడ్డి మీడియాలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి పత్రిక, ఛానల్‌లో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం సాక్షి సంస్థకు సాయిరెడ్డి దూరంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. రాజకీయ సన్యాసం ప్రకటన తర్వాత సాయిరెడ్డి చూపు మీడియా వైపు మళ్లిందంటున్నారు సన్నిహితులు. త్వరలోనే ఓ ఛానల్, పత్రికను సాయిరెడ్డి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే రెండుసార్లు మీడియాలో పెట్టుబడులు పెట్టేందుకు సాయిరెడ్డి ప్రయత్నం చేశారు.2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ కేంద్రంగా నడుస్తున్న AP 24X7 న్యూస్ ఛానల్ ప్రతినిధులతో భేటీ కూడా అయ్యారు సాయిరెడ్డి.
Also Read: విసారెడ్డి రాజీనామా పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఛానల్ తీసుకుంటున్నట్లు ప్రకటించి.. ఉద్యోగులకు భరోసా కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ డీల్ నుంచి సాయిరెడ్డి తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన మరో న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సాయిరెడ్డి భరోసా ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దాని నుంచి ఆయన తప్పుకున్నారు. ఇక పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటన తర్వాత మరోసారి సాయిరెడ్డి చూపు మీడియాపై పడిందనే మాట ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉంది. ఇందుకు టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధి కూడా సహకారం అందిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పాత ఛానల్ తీసుకోవాలా… లేదా ఇప్పటికే నడుస్తున్న సంస్థలను టేకోవర్ చేస్తే సరిపోతుందా అనే కోణంలో చర్చించిన సాయిరెడ్డి.. ఇప్పటికే నడుస్తున్న సంస్థలను టేకోవర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: వైసీపీ కష్టానికి ఆ నలుగురే కారణమా..?
ఇప్పటికే 2 న్యూస్ ఛానల్స్ యాజమాన్యంతో చర్చించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకున్న ఓ ఛానల్ యజమాని… దాదాపు ఏడాది కాలంగా పరారీలో ఉన్నాడు. దీనిని సొంతం చేసుకునేందుకు సాయిరెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే 2007లో అట్టహాసంగా ప్రారంభమైన సూర్య దినపత్రికను తీసుకునేందుకు సాయిరెడ్డి బృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రింటింగ్ యూనిట్లు సూర్య పత్రికకు ఉన్నాయి. అదే తీసుకుని అభివృద్ధి చేస్తే… అన్ని విధాలుగా మేలు జరుగుతుందనేది సాయిరెడ్డి ఆలోచన. ఎంతైనా ఆడిటర్ కాబట్టి… లాభనష్టాలు బేరీజు లేకుండా వ్యాపారంలోకి దిగుతారా అంటున్నారు ఆయన సన్నిహితులు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లో చూపించడం సాయిరెడ్డి ప్రత్యేకత కూడా. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి మీడియా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి మరి.




