వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మరో మాజీ గుడ్ బై చెప్పనున్నట్లు దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు నియంత మాదిరిగా వ్యవహరించిన జగన్ తీరుపై సొంత బంధువులు, సన్నిహితులే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ కు బై చెప్పి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తారనే పుకార్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వాసుపల్లి వైసీపీలో చేరారు. గణేష్ కు చెందిన కాలేజీలో అక్రమాలు జరిగాయనే వైసీపీ ప్రభుత్వం ఆరోపణల నేపథ్యంలోనే వాసుపల్లి పార్టీ మారినట్లు అప్పట్లో తెగ ప్రచారం కూడా జరిగింది. ఇక జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి కూడా గణేష్ మద్దతుగా నిలిచారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాసుపల్లి గణేష్ ఓడిపోయారు. నాటి నుంచి వైసీపీకి, రాజకీయాలకు కూడా గణేష్ దూరంగా ఉన్నారు.
Also Read : కేసుల భయమా..? నియోజకవర్గంలో చిచ్చా..?
అయితే రెండు రోజుల క్రితం వాసుపల్లి గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపధ్యంలో గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కొడాలి, రోజా, వంశీ వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు కారణమన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, హుందాతనం ముఖ్యమని.. ఆ రెండు వైసీపీలో కొందరు నేతలకు లేవంటూ గణేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం వాసుపల్లి గణేష్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని… అందుకే పార్టీ నేతలపై ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చిన గణేష్.. ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.